KCR: పై ఉపోద్ఘాతం కేవలం మూడు అంటే మూడు వాక్యాలు మాత్రమే ఉన్నాయి. అందులో తెలంగాణ అసలుతత్వం కనిపిస్తుంది. తెలంగాణ ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం ప్రస్ఫుటంగా దర్శనమిస్తుంది.. ముందుగానే చెప్పినట్టు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు వేరు.. తెలంగాణ వేరు. తెలంగాణ పుట్టుకలోనే పోరాటం ఉంది. తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు ఉంది. తెలంగాణలో పారే నీటిలో ఉక్కు పిడికిలి ఉంది. ఇది నిజాం ను బొంద పెట్టింది. ఆంధ్ర పరిపాలకులను దూరం పెట్టింది. సొంతోడే నిరంకుశంగా పరిపాలిస్తుంటే తన్ని తరిమేసింది. అందుకే తెలంగాణ అంటే పిడికెడు మట్టి.. ఇన్ని నీళ్లు.. కూసింత మనుషులు మాత్రమే కాదు..
Also Read: ఆంధ్రజ్యోతికి ప్రకటనలు లేవ్.. వేమూరి రాధాకృష్ణపై కేసీఆర్ కు కోపం ఇంకా తగ్గలేదా?
రజతోత్సవంలోకి..
సిల్వర్ జూబ్లీ ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి వరకు మారడంలో అనేక మలుపులను దాటింది కేసీఆర్ గులాబీ పార్టీ.. కొంతమంది ఉద్యమకారుల మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మలిదశ పోరాటానికి రజతోత్సవ వత్సరం. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది. నాటి నుంచి నేటి వరకు కెసిఆర్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ సందర్భాల్లో కేసీఆర్ తన చాకచక్యంతో పార్టీని నడిపారు. మఘలో పుట్టింది.. పుబలో ముగుస్తుంది.. అని చీత్కరింపుల నుంచి రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమ సింహం గా పార్టీని కెసిఆర్ తనకు మాత్రమే సాధ్యమైన చాణక్యంతో నడిపించారు. కొన్ని సందర్భాల్లో గర్జన చేయించారు. మరికొన్ని సందర్భాల్లో కోల్డ్ స్టోరేజ్ లో ఉంచారు. ఈ సమయంలో కేసీఆర్ విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో అభినందనలు కూడా దక్కించుకున్నారు. అధికారంలోకి వచ్చేంతవరకు కేసీఆర్ తెలంగాణ యాసను.. తెలంగాణ భాషను అవలీలగా జనంలోకి తీసుకెళ్ళేవారు. మనోడు.. మనలాంటోడు.. మనకోసం పార్టీ పెట్టాడు.. మనకోసం కొట్లాడుతున్నాడు.. మనకోసం యాష్ట పడుతున్నాడు. అని జనం అనుకునేలా చేసాడు. అందు గురించే కెసిఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. కానీ ఇక్కడే తర్కానికి అందని సమీకరణాలు.. పార్టీ నాయకులకు అంతు పట్టని లెక్కలు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి చేశాయి..
పార్టీకి దూరమయ్యారు
ఇక ఉద్యమాల్లో అటుకులు బుక్కినోళ్ళు.. పస్తులు ఉన్నోళ్లు పార్టీకి దూరమయ్యారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రారంభంలో భుజం కాసిన వాళ్లు గాదె ఇన్నయ్య, ఆలే నరేంద్ర, రేగులపాటి పాపారావు, విజయశాంతి, మందాడి సత్యనారాయణ రెడ్డి, రఘునందన్ రావు, విజయ రామారావు వంటి నాయకులను కేసీఆర్ దూరం పెట్టారు. దూరం చేసుకోగలిగారు. అసలు వీరిని దూరం చేసుకోవడం వెనక ఏం జరిగింది.. కెసిఆర్ అలా ఎందుకు చేశారు.. ఇప్పటికీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరనుకుంటా. వీళ్ళు మాత్రమే కాదు ఈటెల రాజేందర్, చెరుకు సుధాకర్, రాజయ్య యాదవ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, కోదండరా, జితేందర్ రెడ్డి వంటివాళ్లు కేసీఆర్ నుంచి అమానవీయమైన ప్రవర్తనను ఎదుర్కొన్నారు.. ఇక పార్టీలో నెంబర్ 2 గా ఉన్న ఈటెల రాజేందర్ అయితే దాదాపు అత్యంత దారుణమైన అవమానాలు ఎదుర్కొన్నారు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది.. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణాన్ని పెద్దగా తీసుకోలేదు.. కెసిఆర్ అంటేనే భారత రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితి అంటేనే కెసిఆర్ అన్నట్టుగా కొనసాగారు.. అంతేకాదు ఈ పదేళ్లలో పార్టీని వాడుకొని చాలామంది ఎదిగారు. కానీ పార్టీని ఎవరూ ఎదిగేలా చేయలేకపోయారు.
ఆ విషయాన్ని గుర్తిస్తారా?
ఇప్పుడు అరచేతిలో ప్రపంచం కనిపిస్తోంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సర్వం కళ్ళ ముందు ఉంచుతోంది. ఇలాంటి సమయంలో..తన పరిపాలన గొప్ప అని.. తను తెలంగాణ దేవుడని.. తను మాత్రమే తెలంగాణను ఉద్ధరించగలనని.. తను మాత్రమే తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టగలనని కెసిఆర్ ప్రసంగిస్తారనడంలో అతిశయోక్తి కాదు. సుదీర్ఘకాలం ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. అంతే… అంతకుమించి తేడా ఏమీ లేదు.
Also Read: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు జమ అయ్యే తేదీ ప్రకటించిన ప్రభుత్వం.. ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.2 వేలు..