Kavitha New Party: టీఆర్‌ఎస్ మాజీ నేత, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టారు. ముందుగా చెప్పినట్లే టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరుతో పార్టీ ప్రకటించారు. మునీరాబాద్‌లో నిర్వహించిన సభలో పార్టీ పేరు జెండా, ఎజెండా ప్రకటించారు. ఇదే వేదికగా శ్రీకృష్ణుడి భగవద్గీత ప్రేరణతో ’పొలిటికల్ పాంచజన్యం’ పేరుతో ఐదు ముఖ్య హామీలను ప్రకటించారు.
అందరికీ ఉచిత విద్య..
పాంచజన్యంలో తొలి హామీగా కవిత అందరికీ ఉచిత విద్యను ప్రకటించారు. ప్రభుత్వ–ప్రైవేటు వ్యవస్థలతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఇది తల్లిదండ్రుల భారాన్ని తగ్గించి, విద్యా ప్రవేశాన్ని సమానత్వంగా చేస్తుంది.
ఉచిత వైద్యం..
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని వ్యాధులకే ఇది వర్తిస్తుంది. దీంతో వైద్యం ఈ రోజుల్లో భారంగా మారిన నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా అందరికీ, అన్ని వ్యాధులకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. ఏ ఆసుపత్రిలోనైనా, ఎంతటి ఖరీదైన చికిత్స అయినా ఉచితంగా అందేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న పేదలకు గొప్ప ఆశాకిరణం.
రైతును రాజును చేస్తాం..
అనేక ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాయి. కేంద్రం కూడా పీఎం కిసాన్ పేరుతో ఆర్థికసాయం చేస్తుంది. అయితే కవిత ఇలా పెట్టుబడి సాయం ప్రనకటించకుండా కుల వృత్తులను కాపాడతామని, రైతుని రాజుగా మార్చుతామని హామీ ఇచ్చారు. వ్యవసాయ సంస్కరణలు, మద్దతు ధరలు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
యువశక్తికి ప్రాధాన్యం..
ఇక యువతను ఆకట్టుకునేలా ఉపాధికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా ఎలాంటి గ్యారంటీ లేకుండా ప్రభుత్వంమే గ్యారంటీగా ఉండి రుణాలు ఇస్తామని తెలిపారు. ఇక ఉద్యోగాలు చేయడానికి ఒకే నోటిఫికేషన్‌తో ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
సామాజిక న్యాయం..
ఇక చివరి హామీగా సామాజిక న్యాయాన్ని ప్రకటించారు. అందరికీ సమన్యాం చేయడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. చట్టసభల్లో మహిళలకు 50% సీట్లు, ఎస్సీ/ఎస్టీ/బీసీలతోపాటు అగ్రవర్ణ పేదలకు న్యాయం. ఇది సామాజిక సమతుల్యతను పెంచుతూ, అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేశారు.
అమ్మగా ప్రమోట్..
తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలిగా కవిత పార్టీ ఆవిర్భావ సభలో తనను తాను అమ్మగా ప్రమోషన్ చేసుకున్నారు. ప్రతీ హామీ ముందు అమ్మగా తనకు తెలుసు.. బిడ్డల బాధ తల్లికి తెలుసు అంటూ పదే పదే మాట్లాడారు. తద్వారా తెలంగాణలో ఇకపై తనను కవితక్కగా కాకుండా కవితమ్మగా పిలిచేలా ప్రమోట్ చేసుకున్నారు. అమ్మతనంతో పనిచేస్తానని తెలిపారు.
పాంచజన్యం ఎజెండా విద్య, ఆరోగ్యం, రైతులు, యువత, సామాజిక న్యాయం అంశాలపై దృష్టి సార్వత్రికంగా ఆకట్టుకునేలా ఉంది. టీఆర్‌ఎస్ నుంచి విడిపోయిన కవితకు ఇది బలమైన రీఎంట్రీ స్ట్రాటజీ. అయితే, అమలు సామర్థ్యం, ఆర్థిక మూలాలు, పోటీ పార్టీల సవాళ్లు కీలకం. తెలంగాణ ఓటర్లు ఈ ’గీతా ప్రేరణ’ను ఎలా స్వీకరిస్తారో రాబోయే ఎన్నికల్లో తేలనుంది.