Kavitha latest statement: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగా, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయి పదేళ్లు దాటింది. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం ప్రకటించింది. పునర్విభజన చట్టంలో చేరింది. దీంతో ఇంతకాలం విద్య, ఉద్యోగాల్లో తెలంగాణవారు ఆంధ్రాలో, ఆంధ్రావారు తెలంగాణలో పోటీ పడ్డారు. విభజన చట్టం ప్రకారం గడువు ముగిసింది. దీంతో ఇప్పుడు ఎవరి రాష్ట్రం వారిది. ఎవరి పాలన వారిది. ఎవరి కాలేజీలు వారివి, ఎవరి ఉద్యోగాలు వారిని ఈమేరకు తెలంగాణ కూడా అసెంబ్లీలో చట్టం చేసింది స్థానిక విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కాలని నిర్ణయించింది. ఇక 5 శాతం ఉద్యోగాల కోసం ఎవరైనా పోటీ పడొచ్చు. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్(తెలంగాణ రక్షణ సేన)అధ్యక్షురాలు కల్వకుంట్ల రెండ రాష్ట్రాల మధ్య మళ్లీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ‘ఆంధ్రాలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా? తెలంగాణలో ఆంధ్రా పిల్లలకు ఎందుకివ్వాలి?’’ అనే ప్రశ్నలు మళ్లీ వేడిని రాజేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్లుగా కొనసాగుతున్న స్థానికత, నిరుద్యోగం, వనరుల పంపిణీ సమస్యలను లేవనెత్తుతున్నాయి.
కవిత వ్యాఖ్యల వెనుక అర్థం..
కవిత హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘తెలంగాణ స్థానికత – సవాళ్లు’ అనే రౌండ్ టేబుల్‌లో మాట్లాడుతూ, తెలంగాణలో ఇంజినీరింగ్ చదివిన ఇతర రాష్ట్రాల(ముఖ్యంగా ఆంధ్రా) విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఆంధ్రాలో తెలంగాణ వాళ్లను నాన్–లోకల్స్ అని పిలిచి ఉద్యోగాలు నిరాకరించినప్పుడు, తెలంగాణలో ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ముల్కీ రూల్స్‌ను పునరుద్ధరించాలని, గ్రూప్–1 వంటి నియామకాల్లో స్థానికులకు అన్యాయం జరిగిందని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటు తర్వాత స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ను బలపరుస్తున్నాయి.
ముల్కీ రూల్స్ నేపథ్యం..
1948 తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ రూల్స్ అమలులో ఉండేవి. స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండేది. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ నిబంధనలు కొనసాగాయి. 1969, 1972లో జరిగిన ఉద్యమాలు స్థానికత సమస్యను మరింత తీవ్రం చేశాయి. 2014లో తెలంగాణ విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ, ఆస్తుల విభజన, స్థానిక నిర్వచనం వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికతను నిర్దేశించే అధికారం రాష్ట్రాలకు ఉంది (భారత రాజ్యాంగం ఆర్టికల్ 16). కానీ కోర్టులు దీనిని న్యాయబద్ధంగా, అతిశయోక్తి లేకుండా అమలు చేయాలని నిర్ణయిస్తాయి.
స్థానిక యువత ఆందోళన..
తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ‘‘నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. రాష్ట్ర వనరులు స్థానికులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని అనుకోవడం సహజం. నిరుద్యోగం అధికంగా ఉన్న పరిస్థితిలో ఇది మరింత సమర్థనీయం. ఒక రాష్ట్రం స్థానికులకు ప్రాధాన్యత ఇస్తే, మరొకటి కూడా అలాగే చేయవచ్చు. ఇది రాష్ట్రాల మధ్య సమతుల్యతను తీసుకురావచ్చు. రాష్ట్రాలు తమ ఉద్యోగ నియామకాల్లో నివాస అర్హత నిబంధనలు పెట్టుకోవచ్చు. అనేక రాష్ట్రాలు ఇలా చేస్తున్నాయి.
ప్రతికూలతలు, సవాళ్లు..
కవిత వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విభజన భావనను మరింత బలపరుస్తాయి. తెలుగు భాష, సంస్కృతి ఒకటే అయినప్పటికీ, మనోళ్లు.. పరాయోళ్లు అనే భావన పెరుగుతుంది. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక సహకారం, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడిని దెబ్బతీస్తుంది. ఉద్యోగాలు కేవలం స్థానికత ఆధారంగా ఇవ్వడం వల్ల ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు తగ్గవచ్చు. ప్రైవేట్ రంగం, కంపెనీలు ఇప్పటికే మెరిట్ ఆధారంగా నియామకాలు చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా సామర్థ్యం ప్రధానం కావాలి.
కవిత వ్యాఖ్యలు తెలంగాణ యువత ఆందోళనలను బహిరంగంగా లేవనెత్తాయి. స్థానికులకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అయితే ఇది రాజ్యాంగం, చట్టం, మెరిట్‌కు లోబడి ఉండాలి. రెండు రాష్ట్రాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకోవడం కాకుండా, తమ తమ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలి. తెలుగు యువత ఒకటే. వారి భవిష్యత్తు రాజకీయ విభజనల్లో కాక, నాణ్యమైన విద్య, నైపుణ్యాలు, ఆర్థిక అభివృద్ధిలో ఉంది. ఆ దిశగా అందరూ కలిసి పని చేస్తేనే నిజమైన పరిష్కారం సాధ్యం.
“Andhraలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా?”
“Telangana లో ఆంధ్రా పిల్లలకు ఎందుకివ్వాలి?”
– #Kavitha #TRS pic.twitter.com/5zVDEGmEXO
— M9 NEWS (@M9News_) June 25, 2026
