Kavitha Praises Revanth: రాజకీయాలు ఒకే విధంగా ఉండవు. రాజకీయ నాయకులు కూడా ఒకే మాదిరిగా ఉండరు. అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడుతుంటారు. వారి ప్రయోజనాలకు తగ్గట్టుగా అడుగులు వేస్తుంటారు. అధికారంలో ఉన్నవారు దానిని మరింత సుస్థిరం చేసుకోవడానికి రాజకీయాలు చేస్తుంటారు. అధికారం లేనివారు అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. రాజకీయ నాయకులు అన్నాక విమర్శలు చేయడం సహజం. ఆరోపణలు చేయడం సహజం. అంతేకాదు అప్పటికప్పుడు అభినందించడం కూడా సహజమే.
అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎలాగైనా మాట్లాడుతారు. ఉదాహరణకు బిజెపితో అంతగా యుద్ధం సాగనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తారు. అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగిస్తున్నారని.. సంస్కరణలు అమలు చేస్తున్నారని.. ఇంత గొప్ప ప్రధానిని నేను చూడలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నరేంద్ర మోడీతో రాజకీయ విభేదాలు ఏర్పడి దేశంలో చక్రాలు తిప్పుతానని.. గత లేపుతానని కెసిఆర్ ప్రతిజ్ఞలు చేశారు. రాజకీయ పార్టీ పేరును కూడా మార్చేశారు. తెలంగాణను పక్కనపెట్టి ఆస్థానంలో భారత్ అని మార్చారు.. రాజకీయాలు ఎలా ఉంటాయి.. నాయకుల నాకు అనుగుణంగా ఎలా మారిపోతాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే..
Also Read: Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ అందుకే లేట్ చేస్తోందా
తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయాలు ఇప్పుడు ఇలానే మారుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి పనిచేస్తోంది. రేవంత్ రెడ్డి విధానాలను తప్పుపడుతోంది. రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను విమర్శిస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను నాశనం చేస్తున్నాడని మండిపడుతోంది. ఇక ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కనీసం ముఖ్యమంత్రి అని గౌరవం ఇవ్వకుండా ఏకవాక్య సంబోధనతో విమర్శలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే వాడు వీడు అని అనడానికి కూడా వెనుకాడటం లేదు. యాదృచ్ఛికంగా ఆయన సోదరి, భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మాత్రం ఇందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
బనకచర్ల వివాదం నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాదులో మీడియాతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఆమె తెరపైకి తీసుకువచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఆమె సమర్థించారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి ఈ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తుందో అర్థం కావడంలేదని ఆమె అన్నారు. స్థానిక ఎన్నికలకు ముందు కవిత చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత రాష్ట్ర సమితి పెద్దలు రేవంత్ రెడ్డి విషయంలో విమర్శలు చేస్తుంటే.. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని.. ఆర్డినెన్స్ కుదరదని అంటుంటే.. అంతకు విరుద్ధంగా కవిత రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడటం విశేషం.
Also Read: BRS KTR Kavitha Rift: కవితకు షాకిచ్చిన కేటీఆర్..
ఇటీవల భారత రాష్ట్ర సమితి పెద్దలకు, కవితకు గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే భారత రాష్ట్ర సమితి నాయకుల వ్యవహార శైలి ఉండడంతో అది నిజమనే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాలలో సంచలనం కలిగిస్తోంది. ఇది ఎక్కడ వరకు దారితీస్తుంది.. కవిత చేసిన వ్యాఖ్యల వల్ల స్థానిక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.. కవిత చేసిన వ్యాఖ్యల పట్ల భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఎలా స్పందిస్తుంది.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.