Kavitha KCR Rift: తెలంగాణ రాజకీయాలు కొద్దిరోజులుగా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ తిరుగుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం లో అప్పట్లో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆమె అరెస్టు కూడా అయింది. తిహార్ జైల్లో శిక్ష కూడా అనుభవించింది. అనంతరం ఆమె విడుదలైంది. విడుదలైన నాటి నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని సొంతంగా మొదలుపెట్టింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కొద్దిరోజులు కవితకు ఆమె కుటుంబం నుంచి సపోర్ట్ లభించింది. ముఖ్యంగా తండ్రి, సోదరుడు ఆమె విషయంలో ఉదారత చూపించారు. సొంత మీడియా కూడా ఆమెను ఆకాశానికి ఎత్తింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కొద్ది రోజులపాటు కవిత బయటికి రాలేదు. అనారోగ్యానికి చికిత్స పొందడానికి ఆసుపత్రికి మాత్రం వచ్చింది..
ఎప్పుడైతే తన తండ్రికి సొంతంగా ఆమె రాసిన లేఖలు బయటికి వచ్చాయో.. అప్పటినుంచి కుటుంబంలో ఏదో జరుగుతోంది అనే సంకేతాలుబహిర్గతమయ్యాయి. లేఖల కంటే ముందు సామాజిక తెలంగాణను మనం సాధించుకోలేకపోయామని.. ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయామని.. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయలేకపోయామని కవిత చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా కేసిఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. ఇవే విషయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిజెపి నాయకులు వివిధ వేదికల వద్ద పదేపదే ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు పుట్టించిన మంటలు అలా సాగుతుండగానే కవిత రాసిన లేఖల వ్యవహారం బయటికి వచ్చింది. అసలే మంట మీద ఉన్న కేసీఆర్ కు ఇది మరింత అగ్గిని రగిలించింది.
Also Read: Raja Singh Resigns: తప్పు రాజా సింగ్ దే.. బీజేపీది కాదే..!
తన తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయని.. తన పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంటని కవిత వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ లేఖలను లీక్ చేసిన గ్రీకు వీరులు ఎవరో అంటూ కవిత మండిపడటం సంచలనం సృష్టించింది. మొత్తంగా చూస్తే సోదరుడితో ఆమెకు విభేదాలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది. మరోవైపు ఇటీవల ఓ పాత్రికేయుడు నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కవిత తన సోదరుడితో విభేదాలు ఉన్నట్టు అంగీకరించారు. ఏ విషయంలో విభేదాలు ఉన్నాయో మాత్రం ఆమె చెప్పలేదు . ఆ విలేఖరి పదేపదే అడగడానికి ప్రయత్నించినప్పటికీ కవిత దాటవేత ధోరణి ప్రదర్శించారు.
ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు మంచం పొత్తు కంచం పొత్తు వ్యాఖ్యలు.. కవితను తీవ్రంగా బాధించాయి. దీంతో ఆమె అనుచరులు కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడి కార్యాలయం పై దాడి చేశారు. ఇది ఒక రకంగా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ శాసనమండలి సభ్యుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కానీ గులాబీ పార్టీ నుంచి ఒక్కరు కూడా దీనిపై స్పందించలేదు. పైగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. వాస్తవానికి ఇదే తీరుగా కేటీఆర్ పై ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేసినందుకు గులాబీ పార్టీ నాయకులు స్పందించారు. ఆ న్యూస్ కార్యాలయం పై దాడి చేశారు. కానీ కవిత విషయంలో మాత్రం జాగృతిమినహా ఎవరూ స్పందించలేదు. చివరికి కల్వకుంట్ల కవిత స్వయంగా విలేకరుల సమావేశం నిర్వహించి.. కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడికి హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది.
Also Read: Telangana Ads : ఆంధ్రా అనుకూల పత్రికలకు.. రేవంత్ సర్కార్ ప్రకటనలు.. ఇదీ ప్రజా పాలన!
ఇన్నాళ్ల వరకు కల్వకుంట్ల కవితకు కేసిఆర్ బలం.. కేటీఆర్ బలం అనుకునేవారు. ఇప్పుడు ఆ బలం మొత్తం బలహీనమైపోయింది. ఒక రకంగా ఎవరికి వారే అనే సామెత నిజమవుతోంది. నిన్న మొన్నటి వరకు బలమైన ప్రతిపక్షంగా.. బలమైన నాయకుల కార్ఖానాగా కనిపించిన గులాబీ పార్టీ.. ఇప్పుడు అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. అయితే ఈ కలహాలన్నీ నిజమేనా.. కేవలం ఎన్నికల్లో గెలవడానికి చేస్తున్న రాజకీయ ప్రయోగాలా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది. ఇప్పటికైతే కవిత మాత్రం తన సోదరుడితో విభేదాలు ఉన్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. మరి దీనిపై ఇంతవరకు భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు నోరు మెదపలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..