RK OpenHeart Show: అమెరికాలో ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్ ఫ్రే టాక్ షో నిర్వహిస్తారు. అది పేరుకు టాక్ షో మాత్రమే.. ఒక రకంగా ఆత్మీయ సంభాషణ. వ్యాఖ్యాత ప్రశ్నలు అడిగినట్టు.. వచ్చిన అతిధి సమాధానాలు చెప్పినట్టు ఉండదు.. ఇద్దరు వ్యక్తులు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు.. తమ అంతర్గత విషయాలను చెప్పుకుంటున్నట్టు.. ఆ షో ఉంటుంది. అందువల్లే అది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.. తెలుగు మీడియాలో అటువంటి విధానానికి శ్రీకారం చుట్టింది ముమ్మాటికి ఆంధ్రజ్యోతి పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ. తన సొంత ఛానల్ ఏబీఎన్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు.
స్వతహాగానే వేమూరి రాధాకృష్ణ పాత్రికేయుడు. పైగా ఆయనకు సుదీర్ఘ పరిచాలు ఉన్నాయి. ఆపరిచయాలతోనో అనేక సీజన్లు నిర్వహించారు.. రాధాకృష్ణ ప్రశ్నలు అడిగే విధానం.. సరదాగా మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టారు. తద్వారా అవి తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనానికి శ్రీకారం చుట్టాయి.. ముఖ్యంగా కేఏ పాల్, రాంగోపాల్ వర్మతో నిర్వహించిన ముఖాముఖిలు యూట్యూబ్లో అత్యధిక వీక్షణలను సొంతం చేసుకున్నాయి.. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వేమూరి రాధాకృష్ణ ఒకరకంగా నవ్వుతుంటాడు. అలా అతడు నవ్వడం పట్ల రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ తన ధోరణి మార్చుకోలేదు. మార్చుకునే అవకాశం కూడా లేదు..
Also Read: Nara Lokesh about Hindi: పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హిందీ భాష వివాదం
వేమూరి రాధాకృష్ణ ప్రశ్నలు అడిగే విధానం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఆ మధ్య ఒక కథానాయకను ప్రశ్నలు అడిగే విధానం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.. రామ్మోహన్ నాయుడు ను ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర సంస్కృతిని వేమూరి రాధాకృష్ణ అవమానించాడని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమూరి రాధాకృష్ణ వ్యతిరేకంగా నిరసన కూడా వ్యక్తం చేసి , ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇలాంటి పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ వేమూరి రాధాకృష్ణ తన కార్యక్రమాన్ని అప్పట్లో నిర్వహించుకుంటూ నే వెళ్లాడు. గడిచిన ఏడాది మాత్రం కూటమి తరఫున పోటీ చేస్తున్న నేతలను ఆయన ఇంటర్వ్యూలు చేశారు. గుంటూరులో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న పెమసాని చంద్రశేఖర్ నుంచి మొదలు పెడితే కూటమిలో కీలక నాయకుల వరకు వేమూరి రాధాకృష్ణ వరుస పెట్టి ఇంటర్వ్యూ చేశారు. వాస్తవానికి వేమూరి రాధాకృష్ణ ఇలా చేయడం ఆయన సంస్థల్లో పని చేసిన ఉద్యోగులను కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్ద పెద్ద వ్యక్తులను ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ.. కూటమిలోని కొందరు అభ్యర్థులతోనే ముఖాముఖి నిర్వహించడం సంచలనానికి దారి తీసింది. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఇక అప్పటినుంచి వేమూరి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం నిర్వహించడం లేదు. అన్నట్టు ఆ మధ్య కమెడియన్ సత్య రంగబలి సినిమా ప్రమోషన్ కోసం పేరడీ వీడియో చేశాడు.
అందులో అతడు వేమూరి రాధాకృష్ణ లాగా ప్రశ్నలు అడిగాడు. ఒక రకంగా ఆర్కే ఇంటర్వ్యూ చేసే విధానాన్ని అతడు అచ్చు గుద్దినట్టు దింపాడు. అయితే ఇప్పుడు తన పత్రికలో “కొత్త పలుకు” కు మాత్రమే రాధాకృష్ణ పరిమితమవుతున్నాడు. అది కూడా తన సంస్థలో పనిచేసే ఉద్యోగులతోనే రాయిస్తున్నాడు. రాధాకృష్ణ ఒక లైన్ చెబితే.. సంస్థల కొంతమంది ఉద్యోగులు దానిని అల్లుకుంటూ ప్రతి ఆదివారం కొత్త పలుకు సంపాదకీయం రాస్తున్నారు. కానీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ని మాత్రం కొత్త పలుకు స్థాయిలో వేమూరి రాధాకృష్ణ నిర్వహించడం లేదు. బహుశా మరికొద్ది రోజుల్లో ఇంకో సీజన్ ప్రారంభమవుతుందని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ఇదంతా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాల్సి ఉంది.