Kalvakuntla Kavith Ys Sharmila : మనదేశంలో జాతీయ పార్టీల కంటే ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు జాతీయస్థాయి పార్టీలను సవాల్ చేస్తూ అధికారంలోకి వస్తున్నాయి. ఓ తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో రెండుసార్లు భారత రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది. ప్రాంతీయ పార్టీలు ప్రారంభంలో రాజకీయ మనుగడ కోసం ఇబ్బందిపడినప్పటికీ.. ఆ తర్వాత అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాయి. ఏకంగా జాతీయ పార్టీలను సవాల్ చేసే స్థాయి దాకా ఎదిగిపోయాయి. సీట్ల పంపకం.. టికెట్ల పొత్తు.. ఇలా అనేక విషయాల్లోనూ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల ముందు కాలర్ ఎగరేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆ కూటమికి సపోర్ట్ చేస్తున్నాయి. అందువల్లే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
Also Read : కేసీఆర్ చుట్టూ ‘దెయ్యాలు’.. మరి తరిమేదెవరు కవితక్క?
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పవర్ పంచాయతీలు చాలానే చోటుచేసుకున్నాయి. ఇప్పుడే కొత్తగా షర్మిల తోనే మొదలు కాలేదు. ఇది కల్వకుంట్ల కవితతోనే ముగిసిపోదు.. మనదేశంలో ప్రాంతీయ పార్టీలలోనే పవర్ పాలిటిక్స్ ఎక్కువగా చోటుచేసుకున్నాయి. దీనికి బీజం సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో పడింది. నాడు ముఖ్యమంత్రిగా సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు అధికారం కోసం గొడవలు మొదలయ్యాయి. చివరికి సీనియర్ ఎన్టీఆర్ కు ఎటువంటి దుస్థితి ఎదురయిందో అందరికీ తెలుసు. చంద్రబాబు, లక్ష్మీపార్వతి మధ్య ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి అప్పటి తరం వారికి బాగా తెలుసు.
ఇక వైయస్సార్ కుటుంబంలో అధికారం కోసం ఇటీవల ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. నాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల కాలికి బలపం కట్టుకుని పాదయాత్ర చేశారు. చివరికి పార్టీలో తన ప్రభను కోల్పోయేసరికి అన్నపై తిరుగుజెండాను ప్రదర్శిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. అందులో ప్రధానమైనది వైయస్ షర్మిల అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబంలోనూ అధికారం కోసం చిచ్చు రేగినట్టు తెలుస్తోంది. కవిత పార్టీలోని విషయాలపై ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ఆ విషయాలు బయటకు వచ్చిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటిదాకా లోగోట్టు బయటకు తెలియకుండా వ్యవహరించిన గులాబీ బాస్ కుటుంబం.. ఇప్పుడు ఒక్కసారిగా కట్టు తప్పింది. ఇప్పటికైతే కవిత మరో షర్మిల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాజకీయ సంక్షోభాన్ని కెసిఆర్ ఎలా నివారిస్తారనేది చూడాలి.
ఇక మహారాష్ట్రలో శివసేన పార్టీలో ఠాక్రే కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి వివాదాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం అధికారాన్ని దూరం చేస్తోంది. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన విభేదాలను ఇతర పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాది పార్టీలో అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య అధికారం కోసం ఒక యుద్ధమే సాగింది. చివరికి అఖిలేష్ యాదవ్ పార్టీ మీద పట్టు సాధించినప్పటికీ.. శివపాల్ యాదవ్ తో ఇప్పటికీ వైరుధ్యాలే కొనసాగుతున్నాయి.
ఇక తమిళనాడులో కరుణానిధి కుటుంబంలో అధికారం కోసం గతంలో గొడవలు జరిగాయి. కరుణానిధి చనిపోయిన తర్వాత పార్టీ మీద స్టాలిన్ పూర్తిస్థాయిలో పట్టు పెంచుకున్నాడు. కనిమొళి, అలగిరి ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఇప్పటికైతే స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ.. భవిష్యత్తు కాలంలో ఏదైనా జరగొచ్చు అనే సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలో శిరోమణి అ కాళి దళ్ పార్టీలో ఏర్పడిన పవర్ పాలిటిక్స్ గురించి చాలా రోజుల పాటు జాతీయ మీడియాలో భారీ ఎత్తున్నే కథనాలు ప్రసారమయ్యే.. బాదల్ కుటుంబ సభ్యుల పెత్తనాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులు వేరే దారులు చూసుకున్నారు. ఇక నాటి నుంచి పంజాబ్లో శిరోమణి అ కాళిదల్ అధికారంలోకి రావడం అటు ఉంచితే.. కనీసం చెప్పుకోదగ్గ స్థానాలు కూడా గెలవలేకపోతోంది.
ఇక బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అధికారం కోసం చాలానే పంచాయతీలు జరిగాయి. ఇప్పటికైతే తేజస్విని యాదవ్ చేతిలో పార్టీ ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కాలంలో ఎటువంటి ఘటనలైనా చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. త్వరలో అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్విని యాదవ్ నాయకత్వాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ మిగతా కుమారులు ప్రశ్నించే అవకాశం లేక పోలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.