MLC Kavitha Letter: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది బీఆర్‌ఎస్ అలియాన్ టీఆర్‌ఎస్. తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండడంతో నేల విడిచి సాము చేసింది. దీంతో ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. దీనిని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభం బహిర్గతమైంది. కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్‌ఎమ్మెల్సీ కవిత రాసిన ఆరు పేజీల లేఖతో విభేదాలు బట్టబయలయ్యాయి.
భారత రాష్త్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్థాపించిన పార్టీ ఇదీ. 13 ఏళ్ల పోరాటంతో స్వరాష్ట్రం సాధించారు. తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్నారు. ప్రాంతీయ పార్టీ కావడంతో పార్టీలో అంతర్గత స్వేచ్ఛ చాలా తక్కువ. అధినేతే ఓల్ అండ్ సోల్. అయితే అధికారం కోల్పోయాక పార్టీ బలహీన పడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ పంచన చేరినవారంతా ఇప్పుడు ఆ పార్టీని వీడారు. అధికార కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క స్థానం కూడా గెలవలేదు. దీంతో పార్టీ ప్రజల్లో పట్టు కోల్పోయిందన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇటీవల సిల్వర్ జూబ్లీ వేడుకలు వరంగల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత ప్రసంగంపై ఆయన కూతురు కవిత ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కేసీఆర్‌కు లేఖ..
పక్షం రోజుల క్రితం కవిత కేసీఆర్‌కు లేఖ రాసింది. అందులో రెండు పేజీలు పాజిటివ్, నాలుగు పేజీలు నెగెటివ్ ఉన్నాయి. దీంతో లేఖపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో అమెరికా నుంచి వచ్చిన కవిత లేఖ తానే రాసినట్లు అంగీకరించారు. అయితే తాను కేసీఆర్‌ను తప్పు పట్టలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్‌ను దేవుడు అని సంబోధించారు. ఆయన చుట్టూ ‘దెయ్యాలు’ ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో, పార్టీలోని కొందరు నాయకుల అంతర్గత కుట్రలు, విభేదాలను సూచనాత్మకంగా ‘దెయ్యాలు’గా పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కవిత స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్త నాయకులు లేదా అంతర్గత సమస్యలను సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై ఒత్తిడి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి, కేసీఆర్ గాజ్వేల్‌లో గెలిచినప్పటికీ కామారెడ్డిలో ఓడిపోవడం, పలువురు కీలక నాయకులు పార్టీని వీడడం వంటి అంశాలు పార్టీలో అస్థిరతను సృష్టించాయి. కొందరు నాయకులు కేసీఆర్ నాయకత్వాన్ని ‘నియంతృత్వం’గా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులు పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ, కమీషన్ల ఆరోపణలు, నాయకుల మధ్య సమన్వయ లోపం, అంతర్గత వర్గాల మధ్య విభేదాలు పార్టీకి సవాళ్లుగా మారాయి. ఇటీవల కొందరు నాయకులు కాంగ్రెస్, బీజేపీల్లో చేరడం బీఆర్‌ఎస్‌కు మరింత ఒత్తిడిని కలిగించింది.
దెయ్యాల సమస్య పరిష్కారం ఎలా..
కవిత పేర్కొన్న ‘దెయ్యాల’ను తరిమే బాధ్యత ఎవరిదన్న ప్రశ్న రాజకీయంగా కీలకంగా మారింది. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన కవిత, పార్టీలో ఐక్యతను నెలకొల్పేందుకు కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అసంతృప్త నాయకులను కలుపుకొని, అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు ఈ అంతర్గత సంక్షోభాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని కవిత హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలం నిరూపించుకోవాలంటే, ఈ సవాళ్లను అధిగమించడం అత్యవసరం.