Kaleshwaram Tour : సరస్వతి పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు 20,000 మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రోజు నుంచి కూడా భక్తుల రాక కొనసాగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలలో త్రివేణి సంగమ స్నానం చేయడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే సరస్వతి నది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద అంతర్వాహినిగా ప్రవహించడంతో చాలామంది ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. కొందరు ప్రత్యేక వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటుండగా.. మరికొందరు ఆర్టీసీ బస్సులు.. ఇంకొందరు ఇతర మార్గాల ద్వారా కాలేశ్వరానికి వస్తున్నారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కాలేశ్వరం యాత్ర చేసే సమయంలో కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా సందర్శించుకోవచ్చు. ఎటువైపు నుంచి వచ్చే వారికి.. ఏ విధమైన క్షేత్రాలు దర్శనమవుతాయో ఇప్పుడు చూద్దాం..
కాలేశ్వరం చేరుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం రెండు జిల్లాలు.. రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, చతిస్గడ్ నుంచి కూడా తరలివస్తున్నారు. అయితే హైదరాబాదు నుంచి కరీంనగర్ మీదుగా కాలేశ్వరం వెళ్లేవారు రెండు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఒకటి పెద్దపల్లి, మంథని మీదుగా కాలేశ్వరం వరకు వెళ్లొచ్చు. మరొకటి పెద్దపల్లి, గోదావరిఖని, చెన్నూరు మీదుగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే కేవలం కాలేశ్వరం వెళ్లాలనుకునేవారు.. పెద్దపల్లి, మంథని మీదుగా నేరుగా చేరుకోవచ్చు. కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలను.. సుందరమైన దృశ్యాలను చూడడానికి మంచిర్యాల మీదుగా కూడా వెళ్లే అవకాశం ఉంది.
హైదరాబాద్ నుంచి వచ్చేవారు కరీంనగర్ లో మంచిర్యాల రోడ్డు నుంచి రాయపట్నం మీదుగా ప్రయాణం చేయాలని అనుకుంటే.. ఇక్కడ గూడెం గుట్ట అనే సుందరమైన దృశ్యాన్ని చూడవచ్చు. ప్రకృతి మధ్య ఉన్న ఈ గుట్టపై సత్యనారాయణ స్వామి కొలువై ఉంటారు. ఈ స్వామిని దర్శించుకోవడంతో పాటు గుట్టపై నుంచి చూసే అందమైన దృశ్యాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దీనినే రెండో అన్నవరం గా పేర్కొంటారు.
మంచిర్యాల నుంచి చెన్నూరు మీదుగా కాలేశ్వరం వెళ్లేవారు చెన్నూరులోని అంబా అగస్తీశ్వర ఆలయం దర్శించుకోవచ్చు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు నిర్మించారు. వాపర యుగంలో అగస్త్య ముని ఈ ప్రాంతంలో తపస్సు చేశారని ప్రసిద్ధి. ఇక్కడ 410 ఏళ్లుగా అఖండ దీపం వెలుగుతున్నట్లు చెబుతారు.
పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లేవారు కమాన్ పూర్ అనే గ్రామంలో వరాహస్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి గుడి లేకుండా వరాహం రూపంలో నారాయణస్వామి దర్శనం ఇస్తాడు. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందువల్ల కాలేశ్వరం వెళ్లేవారు ఈ స్వామిని దర్శించుకోవచ్చు.
మంథనిలో భారీ శివలింగం ను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున కొలువై ఉంది. ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. భారీ ఆకారంలో ఉన్న ఈ శివలింగం ను దర్శించుకోవడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని ఆశిస్తారు.