Kaleshwaram project corruption: కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. దీంతో కొత్తగా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని గత ప్రభుత్వం ప్రచారం చేసింది. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటూ నేషనల్ జియోగ్రఫీ ఛానెల్‌లో కూడా డాక్యుమెంటరీ ప్రసారం చేయించుకుంది. కానీ, ఈ ప్రాజెక్టు ప్రారంభించిన మూడేళ్లకే ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పిల్లర్ల వద్ద బుంగలు పడ్డాయి. దీంతో బ్యారేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ జరిపిస్తోంది. జస్టిస్ ఘోజ్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజినీర్లుగా పనిచేసి ముగ్గురు అధికారులపై ఏసీబీ దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడుతున్నాయి. దీంతో కాళేశ్వరమే వారికి కాసులు కురిపించింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: కాంగ్రెస్ పై వ్యతిరేకత.. బీఆర్ఎస్ పై నో అనుకూలత.. బీజేపీ సోదిలో లేదు..
మూడు నెలల వ్యవధిలో ముగ్గురిపై ఏసీబీ దాడులు..
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో ఒక భారీ సాగునీటి పథకం, దీనిపై అవినీతి ఆరోపణలు, నిర్మాణ లోపాలు విమర్శలకు దారితీశాయి. ఈ సందర్భంలో ఏసీబీ మూడు నెలల వ్యవధిలో ముగ్గురు ఇంజినీర్లపై దాడులు చేసి, వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించింది. హరిరాం నాయక్, నూనె శ్రీధర్, సీ.మురళీధర్ రావు ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లపై జరిపిన దాడుల్లో బారీగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి.
బి. హరిరాం నాయక్..
కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్–ఇన్–చీఫ్ బి. హరిరాం నాయక్‌పై ఏప్రిల్ 26న ఏసీబీ 14 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణ లోపాలను గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకోబడింది. హరిరాం నాయక్ ఆస్తుల విలువ రూ.450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది.
నూనె శ్రీధర్ వద్ద రూ.200 కోట్లు..
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసిన నూనె శ్రీధర్‌పై ఏసీబీ 12–14 ప్రదేశాలలో జూన్ 11న దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌లో విల్లా, బహుళ ఫ్లాట్లు, 19 రెసిడెన్షియల్ ప్లాట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హోటళ్లలో వాటాలు, నగదు, బంగారం వంటి ఆస్తులు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ సుమారు రూ.60– రూ.70 కోట్లుగా అంచనా వేయబడింది. అతని తాయ్‌లాండ్‌లో జరిగిన విలాసవంతమైన వివాహ వేడుక కూడా దృష్టిని ఆకర్షించింది. శ్రీధర్ అరెస్ట్ చేయబడి, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మొత్తంగా అతని వద్ద రూ.200 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అంచనా వేసింది.
సీ. మురళీధర్ రావు ఆస్తులు రూ.650 కోట్లు
ఇరిగేషన్ విభాగంలో మాజీ ఇంజినీర్–ఇన్–చీఫ్ అయిన మురళీధర్ రావుపై ఏసీబీ 10–12 ప్రదేశాలలో దాడులు చేసింది. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌లలో కొండాపూర్‌లో విల్లా, కోకాపేట, బంజారాహిల్స్‌లో ఫ్లాట్లు, 11 ఎకరాల వ్యవసాయ భూమి, మొకిలలో 6,500 చదరపు గజాల ఆస్తులు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లుగా అంచనా వేయబడింది, అయితే మార్కెట్ విలువ ఇంకా లెక్కించబడుతోంది. ఇతని ఆస్తులు రూ.650 కోట్లు ఉంటాయని అంచనా.
Also Read: బనకచర్ల : ఏపీ, తెలంగాణ మధ్య ఓ వరదనీటి వివాద కథ
ముగ్గురే రూ.1,500 కోట్లు కొల్లగొట్టారు..
ముగ్గురు అధికారులపై ఏసీబీ దాడుల్లో గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.1,500 కోట్లు ఉంటుందని అంచనా. హరిరాం నాయక్ రూ.450 కోట్లు, శ్రీధర్ రూ.200 కోట్లు, మురళీధర్‌రావు రూ.650 కోట్లు సంపాదించినట్లు ఏసీబీ లెక్కలు చెబుతున్నాయి. అంటే కేవలం ముగ్గురు అధికారులే ఇంత భారీమొత్తంలో అవినీతికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. ముగ్గురు ఇంజినీర్లు అరెస్ట్ అయ్యారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. వీరి విచారణతో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో విపక్షాలు ఆరోపించినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే అధికారులకు ఏటీఎంలా మారినట్లు తెలుస్తోంది.