Revanth Reddy win: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు. చివరికి ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు కూడా ఏమాత్రం ఆశ లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ గడిచిన రెండు పర్యాయాలుగా గులాబీ పార్టీకి జై కొట్టింది. పైగా మాగంటి గోపీనాథ్ కు అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు సునీతకు సింపతి ఓట్లు పడతాయని నమ్మకం ఉంది. పైగా గులాబీ పార్టీ సోషల్ మీడియా వింగ్, మీడియా వింగ్ విపరీతంగా ప్రచారం చేశాయి. కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనే పోటీ చేస్తున్నట్టుగా రంగంలోకి దిగాడు. రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. దీంతో గులాబీ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడైతే జూబ్లీహిల్స్ స్థానంలో జరిగే ఉప ఎన్నిక తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అని చెప్పాడో .. అప్పుడే రేవంత్ దీనిని అత్యంత సీరియస్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత కథ మొత్తం తను నడిపించాడు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనే బిసి వ్యక్తిని ప్రకటించడం ద్వారా రేవంత్ గేమ్ తనవైపు తిప్పుకున్నాడు. పైగా నవీన్ ఉన్నత విద్యావంతుడు. ఓడిపోయినప్పటికీ.. గెలిచినప్పటికీ తను అక్కడే ఉంటాడు. పైగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూమెంట్ విపరీతంగా ఉంది. పైగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బీసీ ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని రేవంత్ మాట ఇవ్వడం.. కమ్మ ఓటర్లతో మీటింగ్లు పెట్టాడు. పైగా చంద్రబాబు నిశ్శబ్దంగా ఉన్నాడు. దీంతో కమ్మ ఓటర్లు కాంగ్రెస్ కు జై కొట్టారు. జనసేన కూడా తెర వెనుక మద్దతు ఇవ్వడంతో కాపు ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. మజ్లీస్ మద్దతు ఇచ్చినప్పటికీ.. రేవంత్ ఏమాత్రం నమ్మలేదు. అత్యంత వ్యూహాత్మకంగా అజరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. అంతేకాదు ముస్లింలకు స్మశాన వాటిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక్కడ గులాబీ పార్టీకి సంబంధించిన మైనారిటీ ఓటు బ్యాంకు మొత్తాన్ని చీల్చి పడేశాడు రేవంత్.
సీనియర్లతోపాటు జూనియర్ మంత్రులకు అనేక ప్రాంతాల బాధ్యతలు అప్పగించాడు. అన్నిటికంటే ముఖ్యంగా టార్గెట్ ఫిక్స్ చేశాడు. దీనికి తోడు పోల్ మేనేజ్మెంట్ విషయంలో రేవంత్ ఏ మాత్రం రాజీ పడలేదు. ఇక సానుభూతిని బ్రేక్ చేయడానికి గతంలో ఏకగ్రీవం విధానం ఉంటే.. దానిని కేసీఆర్ ఎలా బద్దలు కొట్టాడో రేవంత్ వివరించాడు. పి జనార్దన్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి ద్రోహం చేశాడో ఉదాహరణలతో చెప్పాడు. పిజెఆర్ పేరు వాడుకున్నాడు. మాగంటి కుటుంబానికి సానుభూతి దక్కకుండా గండి కొట్టాడు. ముఖ్యంగా కెసిఆర్ అవకాశవాదాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాడు.
సినీ కార్మికుల ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అధికంగా ఉంటాయి. దీంతో వారితో సమావేశం ఏర్పాటు చేశాడు రేవంత్. అప్పటికప్పుడు వారికి 10 కోట్లు ఇస్తానని ప్రకటించాడు. 20% వాటా సినీ కార్మికులకు ఇస్తేనే టికెట్ రేట్లు పెంచుతానని ప్రకటించాడు రేవంత్. తద్వారా సినీ కార్మికులకు కూడా అత్యంత దగ్గరగా కనెక్ట్ అయిపోయాడు.. గులాబీ పార్టీకి ఓటు వేస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు మొత్తం ఆగిపోతాయని రేవంత్ ప్రచారం చేసాడు. అంతేకాదు గులాబీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో వివరించాడు. సునీత పట్ల ప్రజలకు పెద్దగా ఆదరణ లభించకుండా ఉండడానికి కవిత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇంటి ఆడబిడ్డ నే కేటీఆర్ పట్టించుకోవడంలేదని.. మాగంటి సునీతను మాత్రం ఏం పట్టించుకుంటారని రేవంత్ ప్రశ్నించాడు. పైగా కవిత చేస్తున్న ఆరోపణలను పదే పదే ప్రస్తావించాడు.
మాగంటి మరణం పై ఆయన మాతృమూర్తి, మొదటి భార్య సునీత మీద కేసు పెట్టిన విధానాన్ని పదే పదే ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. అదే కాదు కేటీఆర్ అవకాశవాదాన్ని వివరించారు. ఒక రకంగా సునీత మాగంటి గోపీనాథ్ ను లీగల్ గా పెళ్లి చేసుకోలేదు అనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాడు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ పని అయిపోయిందని గులాబీ పార్టీ మీడియా, దాని అనుబంధ సోషల్ మీడియా గ్రూపులు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి . ప్రచారానికి తోడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా రకరకాలుగా లీకులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు. వారందరికీ ఈ గెలుపు ద్వారా బలమైన సమాధానం చెప్పగలిగాడు రేవంత్.
ఇదే సమయంలో అధిష్టానానికి బలమైన సమాధానం కూడా ఇచ్చాడు. కాంగ్రెస్ కాదు.. కాంగ్రెస్ పార్టీకే రేవంత్ రెడ్డి చాలా అవసరం అనే విధంగా సంకేతాలు ఇవ్వగలిగాడు. అందువల్లే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరిగిన ఉప ఎన్నికను అత్యంత కఠినమైన సవాల్ లాగా తీసుకున్నాడు. విపరీతంగా కష్టపడ్డాడు. ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు పోయాడు. అన్నట్టు ఈ ఎన్నికను తెలంగాణ ప్రభుత్వానికి రెఫరెండం అని కేటీఆర్ అన్నాడు. ఈ ప్రకారం చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం పాసైనట్టే కదా.. ముఖ్యమంత్రిగా రేవంత్ విజయవంతమైనట్టే కదా..