Jubilee Hills By Election: జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక ఆక్రమణల తొలగింపునకు రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా విశ్వనగరంలో వివాదాస్పదమైంది. ఇలాంటి పరస్థితుల్లో వచ్చిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు సీఎం రేవంత్‌రెడ్డికి ఒక అగ్ని పరీక్షలా మారాయి. అధికారంలో ఉన్నప్పటికీ, ఆయనకు పార్టీ స్వేచ్ఛ తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో విజయం సాధించడం అంత ఈజీ కాదు. ఫలితం ఏదైనా, దాని రాజకీయ ప్రభావం నేరుగా రేవంత్‌పైనే పడుతుందని విశ్లేషకులు, పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గెలిస్తే పార్టీ క్రెడిట్ మొత్తం హైకమాండ్ సొంతం అవుతుంది. ఓడిపోతే బాధ్యత మాత్రం రేవంత్‌పైనే వేస్తారనేది స్పష్టంగా కనిపిస్తోంది.
హైకమాండ్ వ్యూహం…
రేవంత్ రెడ్డి చురుకుదనమే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం. అయినప్పటికీ, ఆయన వేగం అధికమైతే మరొక మైనస్ అవుతారన్న భయంతో హైకమాండ్ నిరంతరం నియంత్రణ విధానం అనుసరిస్తోంది. కేబినెట్‌లో రేవంత్ సిఫారసులను పట్టించుకోవడం లేదు. కీలక నిర్ణయాలలో ఇతర నేతలకు ప్రాధాన్యత ఇచ్చి సమతుల్యం సాధించాలని చూస్తున్నారు. హైకమాండ్ మద్దతు ఉన్న నేతలు సీఎం అధికార పరిధిలోకి రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రేవంత్ ప్రభుత్వంలో స్పష్టమైన విభజన వాతావరణం ఏర్పడిందని పరిశీలకుల అభిప్రాయం.
సమన్వయం తక్కువ.. వివాదాలు ఎక్కువ..
నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉన్న జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో ప్రచారానికి మించిన అంతర్గత విభేదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ స్థాయిలో ఆయనకు మద్దతు ఉన్నప్పటికీ, రాష్ట్ర నేతలు పరస్పర విభేదాలతో ప్రచారాన్ని గందరగోళంగా మార్చారు. ఒకరిని మరొకరు దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు వ్యవహరిస్తున్నట్లు కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నేరుగా ప్రచారంలోకి దిగుతారా అన్నది ఇంకా అనిశ్చితమే.
విజయమా? ఓటమా?
రేవంత్ స్వయంగా ప్రచారంలోకి దిగుతారని హైకమాండ్ సంకేతాలు ఇస్తోంది. దీంతో గెలిస్తే రేవంత్‌కు అధిష్టానం వద్ద మరింత గుర్తింపు లభిస్తుంది. పట్టు దొరుకుతుంది. ఓడితే మాత్రం ఆయనపై విమర్శలు తప్పవు. సొంత పార్టీలోని వ్యతిరేకులు, మంత్రి పదవి ఆవించి భంగపడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి నాయకులతో ఇబ్బందులు తప్పవు. అంటే ఈ ఉపఎన్నిక రేవంత్‌కు చావో రేవో అన్న పరిస్థితిని సృష్టించింది. నాయకత్వపరంగా ఆయన స్థానాన్ని బలపరచడం కాకుండా, మరింత అప్రమత్తతతో వ్యవహరించే పరిస్థితి నెలకొంది.
రేవంత్ ఈ ఉపఎన్నికను తన ప్రతిష్ఠాత్మక పోరుగా మార్చుకోవడం తప్ప మరో మార్గం లేదు. గెలుపు ఆయన రాష్ట్రస్థాయి ఆధిపత్యాన్ని నిలబెట్టగలిగే మార్గం అవుతుంది. కానీ అంతర్గత శక్తులు, హైకమాండ్ గణాంకాల పాలిటిక్స్ ఆయన భవిష్యత్ కూడదారిని నిర్ణయించవచ్చు. ఈ పోరాటం రేవంత్ రెడ్డి రాజకీయ బలహీనతా లేక బలమా తేల్చేదిగా నిలుస్తుంది.