https://oktelugu.com/

BRS: కేసిఆర్ ఆగమంటున్నారు..! వారు మాత్రం ఆగలేమంటున్నారు..!

తెలంగాణలో కొన్నైనా లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని గులాబీ అధినాయకత్వం అంచనా వేసుకుంది. తద్వారా కేంద్రంలో తాము చక్రం తిప్పేందుకు ఆస్కారం ఉంటుంది ఆ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : June 7, 2024 / 12:54 PM IST

    BRS

    Follow us on

    BRS: కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవనున్నారు. తెలంగాణలోని లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నానే మిగిలింది. ఏపీలోనూ కేసీఆర్ దోస్త్ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల సంఖ్య అటుంచితే.. చెప్పుకోదగ్గ స్థానాలను కూడా వైసిపి సాధించలేదు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఎటు చూసినా..బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు పెద్ద మైనస్ గా మారింది. వాస్తవానికి తెలంగాణలో కొన్నైనా లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని గులాబీ అధినాయకత్వం అంచనా వేసుకుంది. తద్వారా కేంద్రంలో తాము చక్రం తిప్పేందుకు ఆస్కారం ఉంటుంది ఆ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది. ఒకవేళ రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో లోక్సభ స్థానాలు రాకున్నా..ఏపీలో తన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవతారని భావించింది.

    పై కారణాలు చెప్పే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్నాళ్లు తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగారు. ఆంధ్రాలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తమకు కాస్త రిలీఫ్ ఉంటుందని లేదా తెలంగాణ లో ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకున్నా…తమకు ఢోకా ఉండదని వారికి నచ్చ చెప్పుకున్నారు. అయితే ఇవేవీ వర్కౌట్ కాకపోవడంతో.. ఇప్పుడు తెలంగాణ భవన్ నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్ లేదా బిజెపి వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే మాజీమంత్రి మల్లారెడ్డి,ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే వీరి బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి,లక్ష్మారెడ్డిలు కూడా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. వాస్తవానికి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా గులాబీ పార్టీ గ్రేటర్ లోనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధపడటం కేసీఆర్ ను ఆందోళనకు గురిచేస్తుంది.

    ఇక పార్టీ మారే విషయంలో కెసిఆర్ కు మల్లారెడ్డి,రాజశేఖర్ రెడ్డి,సుధీర్ రెడ్డి,లక్ష్మారెడ్డిలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. తాము కాంగ్రెస్ లోకి పోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పేశారు. ఇదే విషయం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక వీరితోపాటు మరి కొంతమంది ఎమ్మెల్యేలు కారు దిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో వెంటనే అలర్ట్ కెసిఆర్ మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి,లక్ష్మారెడ్డి,సుధీర్ రెడ్డిలను ఫాంహౌజుకు పిలిపించుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వారి నుంచి సానుకూల దృక్పథం రాకపోవడంపై కెసిఆర్ కొంత అసహనానికి గురైనట్లు తెలుస్తుంది. అయితే వీరి పార్టీ మార్పును అడ్డుకునేందుకు కెసిఆర్ ఆ నలుగురు ఎంఎల్ఏలతో దిగిన ఫోటోను కావాలనే వైరల్ చేయించినట్లు టాక్. తద్వారా వీరు పార్టీ మారడం లేదనే సంకేతాలను పంపే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతుంది. అయితే కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కారు దిగడం ఖాయమనే ప్రచారముంది.