BRS: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పతనానికి అది కూడా ఓ కారణమే?

ఓటుకు నోటు కేసు కారణంగా రేవంత్, చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చిన కేసీఆర్‌ అంతకు మించి ఏమీ చేయలేకపోయారు. అయితే ఇదే సమయంలో ఇద్దరు నేతలకు కేసీఆర్‌ బద్ధ శత్రువుగా మారారు.

Written By: Raj Shekar, Updated On : July 6, 2024 4:38 pm

BRS

Follow us on

BRS: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత మరింత దిగజారింది. పదేళ్లు అధికారంలో తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌కు ఈ పరిస్థితి రావడానికి వందల కారణాలు ఉన్నాయి. వాటిని పార్టీ అధినేత కేసీఆర్‌ అంగీకరించకపోయినా అవి వాస్తవాలు. ఈ కారణాల్లో ఓటుకు నోటు కేసు కూడా ఒకటి. కేసీఆర్‌ చాలా తెలివిగా ఒకేసారి రేవంత్‌ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని ట్రాప్‌ చేసి, ఇద్దరినీ అప్రదిష్టపాలు చేసి రాజకీయంగా దెబ్బ తీయాలనుకున్నారు. ఈ ప్రయత్నంలో కొంతవరకు విజయం సాధించారు. మరోవైపు ఈ కేసుతో కేసీఆర్‌ తెలంగాణలో హీరో అయ్యారు.

పెరిగిన శత్రుత్వం..
ఓటుకు నోటు కేసు కారణంగా రేవంత్, చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చిన కేసీఆర్‌ అంతకు మించి ఏమీ చేయలేకపోయారు. అయితే ఇదే సమయంలో ఇద్దరు నేతలకు కేసీఆర్‌ బద్ధ శత్రువుగా మారారు. నాడు రేవంత్‌రెడ్డిని జైలుకి పంపించి, కూతురు పెళ్లి చేస్తున్నప్పుడు ఇబ్బందిపెట్టారు. చంద్రబాబును కూడా జైల్లో పెట్టేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. కానీ ఫలించలేదు. అయితే అప్పుడే రేవంత్‌రెడ్డి ఏనాటికైనా కేసీఆర్‌ని ఓడించి అదే జైలులో చిప్పకూడు తినిపిస్తానని శప«థం చేశారు. చెప్పినట్లుగానే ఎన్నికల్లో ఓడించారు. శపథం ప్రకారం చిప్పకూడు తినిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈమేరకు అక్రమాలపై విచారణ చేయిస్తున్నారు. దీంతో జైలుకు వెళ్లక తప్పదని కేసీఆర్‌ కూడా డిసైడ్‌ అయ్యారు.

సీన్‌ రివర్స్‌..
ఓటుకు నేటు కేసుతో చంద్రబాబును, రేవంత్‌రెడ్డిని దెబ్బతీశానని కేసీఆర్‌ పొంగిపోయారు. కానీ, పదేళ్ల తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పుడు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. ఓటుకు నోటు కేసు నాటి నుంచే కేసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో కేసీఆర్‌కు ఉచ్చు బిగుస్తోంది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు నాడు తమ పరువు తీసి, రాజకీయంగా దెబ్బతీసిన కేసీఆర్‌ను అంతకన్నా ఎక్కువ దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. నాడు కేసీఆర్‌ వారిద్దరినీ ట్రాప్‌ చేసి రాజకీయంగా దెబ్బతీయకుంటే నేడు కేసీఆర్‌ ఓటమి కోసం ఇద్దరూ కలిసి పనిచేసేవారు కాదు. కేసీఆర్‌ తాను అందరికన్నా గొప్ప రాజకీయ నేతనని, మేధావిని అని, అపర చాణక్యుడిని అని నిరూపించుకునేందుకు నాడు చేసిన ప్రయత్నమే నేడు ఆయన పతనానికి కారణం అయింది.