HomeతెలంగాణSelf-Pity: స్వయం కృపరాధమేనా.. ఆందోళనలు చేసి పోలీసులు ఏం సాధించారు..?

Self-Pity: స్వయం కృపరాధమేనా.. ఆందోళనలు చేసి పోలీసులు ఏం సాధించారు..?

Self-Pity: ఏక్ పోలీస్ అంటూ నినదిస్తూ ఉద్యమానికి దిగిన పోలీస్ బెటాలియన్ ఉద్యోగులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. డిమాండ్ల సాధనకు కోసం ఉద్యమం చేపడితే.. చివరకు ఉద్యోగాలే కోల్పోవాల్సిన దుస్థితి వచ్చింది. పోలీసులు కూడా ప్రభుత్వంలో భాగమే. వారూ ప్రభుత్వ ఉద్యోగులమనే భావనను మరిచి ఏక్ పోలీస్ అంటూ బెటాలియన్ పోలీసులూ నిరసనలకు దిగారు. కానీ.. అవగాహన రాహిత్యంతో ఇప్పుడు వారి ఉద్యోగాలకు ప్రమాదం వచ్చింది. వారికీ సర్వీస్ రూల్స్ ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు బెటాలియన్ పోలీసులు సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించారు. దాంతో ప్రభుత్వానికి పూర్తి నిర్ణయాధికారం ఉంటుంది.

మూడు నాలుగు రోజులుగా ఆందోళనలు చేస్తున్న బెటాలియన్ పోలీసులకు ఒకరి తరువాత ఒకరికి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. భార్యలతో సహా రోడ్లపైకి రావడం వెనుక పార్టీల ఉచ్చులో చిక్కుకున్నారన్న ప్రచారమూ ఉంది. ఏక్ పోలీసుపై గతంలో ఉన్న ఉత్తర్వులనే అమలు చేస్తామని ఇప్పటికే డీజీపీ ఓ క్లారిటీ ఇచ్చారు. అయినా.. పోలీసులు మాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళనలు కొనసాగించారు. అయితే.. డీజీపీ వివరణ ఇవ్వడంతో ప్రభుత్వం దిగి వచ్చిందని పోలీసులు భావించారు. కానీ.. ఇదే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. దాంతో ఒకరి తరువాత మరొకరికి ఉద్వాసను పలుకుతూనే ఉంది. ఇప్పటికే పది మందిని డిస్మిస్ చేయగా.. ఇంకా యాభై మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వీరి స్థానాల్లో ప్రభుత్వం కొత్త రిక్రూట్‌మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పోలీసు డిపార్ట్మెంట్లో కష్టాలు ప్రతిఒక్కరికీ ఉన్నాయి. అవి బెటాలియన్ పోలీసులకు కావచ్చు.. మామూలు పోలీసులకు కావచ్చు.. ఎవరి స్థాయిలో వారికి లేకపోలేవు. కాకుంటే కొంత మంది లోలోపల బాధపడుతున్నారు. కానీ.. బెటాలియన్ పోలీసులు మాత్రం ఇలా రోడ్లపైకి వచ్చి చేరారు.

ఎవరికి ఏ సమస్యలు ఉన్నా.. వారికి అనుబంధంగా పలు యూనియన్లు ఉంటాయి. యూనియన్ల తరఫున ఆందోళన చేయడమా.. ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వడమా చేయడం కామన్. కానీ.. ఇలా ప్రత్యక్షంగా పోలీసులే ఆందోళనకు దిగడం అది నిబంధనలకు విరుద్ధం. ఇక.. వీరి ఆందోళనకు ఓ వర్గం మీడియా కూడా బాగా హైలైట్ చేస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కంటెంటును అలాంటి రక్తికట్టించే స్టోరీలనే నడిపించారు. రీల్స్ కూడా చేయించారు. గర్భిణులు, భర్తల స్టోరీలను వినిపించారు. ఆ స్టోరీలను చూసిన వారు ఎవరికైనా పాపం అనే ఫీలింగ్ రాక మానదు. అందుకే.. పోలీసుల ఆందోళనల వెనుక మరో ఆసక్తికరమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనవసరంగా పోలీసులు రాజకీయ పార్టీలకు పావులుగా మారారని టాక్ నడుస్తోంది. పోలీస్ ఉద్యోగం సాధించేందుకు వారు పడిన శ్రమ అంతా వృథా అయిందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కావాలన్నా కోచింగ్ పోవాలి.. గ్రౌండ్లలో పరిగెత్తాలి.. ఎన్నో పగలు రాత్రులు కష్టపడి చదవాలి.. కానీ ఇప్పుడు తీసుకున్న కొద్దిపాటి నిర్లక్ష్యంతో ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి రావడం స్వయంకృపరాధమే అని చెప్పక తప్పదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version