Homeజాతీయ వార్తలుIPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. అసలు కారణం ఇదే!

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. అసలు కారణం ఇదే!

IPS Transfers: రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్.. సీనియారిటీ ప్రకారం కొందరికి ప్రమోషన్లు రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఐపీఎస్‌ల బదిలీ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. సర్కార్ నిర్ణయంతో ఏకంగా 30 మంది అధికారులు స్థానచలనం పొందారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెండ్రోజుల్లో తమ తమ స్థానాల్లో పోలీసు ఉన్నత అధికారులు రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ బదిలీల ప్రక్రియ పై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేస్తున్నాయి. బదిలీల పేరుతో కొందరు అధికార పార్టీ లీడర్స్ కావాలనే పట్టుబట్టి తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులను వారి ఇలాఖాలో పోస్టింగ్ ఇప్పించుకున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
IPS Transfers:
IPS Transfers:
బదిలీలు పారదర్శకంగా జరిగాయా?
సాధారణంగా సివిల్ సర్వీసెస్ అధికారులు ఐదేళ్లకొకసారి లేదా ప్రభుత్వ అవసరాలను బట్టి స్థానం చలనం పొందుతుంటారు. వారి సీనియార్టీ ఆధారంగా కూడా ప్రభుత్వం ప్రమోషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కొందరు సివిల్ సర్వీసెస్ అధికారులు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరీ ప్రమోషన్ల కోసం అధికార పార్టీ నాయకులు చెప్పిన మాట వింటున్నారని తెలుస్తోంది. కొందరు పొలిటికల్ ప్రెషర్‌ను భరిస్తే మరికొందరు అస్సలు భరించరు. దీంతో వారు వరుసగా బదిలీ అవుతుంటారు. ఈ దేశంలో నిజాయితీకి దక్కిన గుర్తింపు ఇదే అని మాజీ పోలీసు, బ్యూరోక్రాట్స్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజుల్లో శాంతిభద్రతలకు, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొందరు ఐపీఎస్ అధికారులు ప్రభుత్వంలోని పెద్దల మాట విని వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. నిజాయితీగా పనిచేసే పోలీసు అధికారులు, బ్యూరోక్రాట్స్ గుర్తింపునకు నోచుకోని పోస్టుల్లో కొనసాగుతున్నారు. అయితే, తాజాగా జరిగిన బదిలీల్లో తమకు అనుకూలంగా ఉండే అధికారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం బదిలీలు జరిగాయని వాదనలు వినిపిస్తున్నా అందులో ఎంత మేర వాస్తవం ఉందనేది తెలుసుకోవడం కష్టమే. ప్రస్తుతం, ఎవరెవరు ఏ స్థానాలకు వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్..
తెలంగాణ ప్రభుత్వం నిన్న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఇంతకు ముందు ఆ స్థానంలో కొనసాగిన అంజనీ కుమార్ ఏసీబీ డైరక్టర్ జనరల్‌గా అపాయింట్ అయ్యారు. మొత్తం 30 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కలిగింది. బదిలీ అయిన వారిలో కీలక అధికారులు ఉన్నారు. ఏసీబీ డైరెక్టర్‌గా శిఖా గోయెల్‌, ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా రంగనాథ్‌, హైదరాబాద్ వెస్ట్‌ జోన్‌ డిప్యూటీ కమిషన‌ర్‌గా జోయల్‌ డేవిస్, సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీగా కల్మేశ్వర్‌, నల్గొండ ఎస్పీగా రమారాజేశ్వరి నియామకం అయ్యారు. సైబరాబాద్‌ జాయింట్‌ సీపీగా అవినాష్‌ మహంతి, సిద్దిపేట కమిషనర్‌గా శ్వేత, మెదక్‌ ఎస్పీగా రోహిణి, నార్త్‌జోన్‌ డీసీపీగా చందనా దీప్తి, సీసీఎస్‌ డీసీపీగా గజరాంగ్‌ భూపాల్‌ను అపాయింట్ చేసింది.
హైదరాబాద్ స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ సీపీగా విశ్వప్రసాద్, మహబూబాబాద్‌ ఎస్పీగా శరత్‌చంద్ర, వికారాబాద్‌ ఎస్పీగా కోటిరెడ్డి, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ప్రకాష్‌రెడ్డి, ఆదిలాబాద్‌ ఎస్పీగా ఉదయ్‌కుమార్‌,నిజామాబాద్‌ సీపీగా కేఆర్‌ నాగరాజు ను నియమించింది. ఆసిఫాబాద్ ఎస్పీగా సురేష్, నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్‌, నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా మనోహర్‌, మాదాపూర్‌ డీసీపీగా శిల్పవల్లి, బాలానగర్‌ డీసీపీగా గోనె సందీప్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. శంషాబాద్ డీసీపీగా జగదీశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, జనగామ డీసీపీగా సీతారాం, భూపాలపల్లి ఎస్పీగా సురేందర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీగా వెంకటేశ్వర్లును తెలంగాణ సర్కార్ నియమించింది.
Exit mobile version