IPS Sajjanar : ఆర్టీసీ ఎండీగా నియమితులైన నాటి నుంచి సంచలన నిర్ణయాలతో ఆకట్టుకుంటున్నారు వీసీ సజ్జనార్. ఆర్టీసీలో కార్గో నుంచి మొదలుపెడితే విహారయాత్రలకు ప్రత్యేకంగా బస్సులను నడపడం వరకు.. ఇలా ఆర్టిసి తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక సజ్జనార్ ఉన్నారు. ఆయన ఎండిగా నియమితులైన నాటి నుంచి ఆర్టీసీ ఆర్థికంగా అంతకంతకు అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ బస్సులను నడుపుతూ మరింత ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇందులో భాగంగా మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ దూసుకుపోతోంది. ఆర్టీసీ వినూత్నమైన ప్యాకేజీలను కూడా అందిస్తోంది. ఈ విషయాలను ఆ సంస్థ ఎండి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంటున్నారు. వారి నుంచి వచ్చే సలహాలను స్వీకరిస్తున్నారు. ఆ వేదిక ద్వారానే ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అందువల్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీ గా కొనసాగిస్తోంది. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్ అప్పుడప్పుడు వినూత్నమైన వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. అలాంటి వీడియోనే ఆయన తాజాగా ఒకటి పోస్ట్ చేశారు. ఇది నెటిజన్లు మన్ననలను విశేషంగా పొందుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు వెళ్తున్నారు. అందులో ఓ ఆంధుడు అద్భుతమైన పాట పాడుతున్నాడు. శ్రీ ఆంజనేయం సినిమాలోని “రామ రామ రఘురామ.. అని పాడుతున్న హనుమ.. అంత భక్తి పరవశమా.. ఓ కంట మము కనుమా” అనే పాటను ఆ అంధుడైన యువకుడు అద్భుతంగా ఆలపించాడు. అతని గాత్రం ఆమోఘంగా ఉంది. పాట పాడుకుంటూ.. తన కాళ్లపై చేతులతో దరువు వేసుకుంటూ.. చుట్టూ ఉన్న ప్రయాణికులను అతడు ఓలలాడించాడు. తన పాట మాధుర్యంలో సమ్మోహితులను చేశాడు. ఈ విషయాన్ని సజ్జనార్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు..”మనం చూడలే గాని ఇలాంటి మట్టిలో మాణిక్యాలు చాలా ఉంటాయి. ఎం ఎం కీరవాణి గారు ఇలాంటి వారికి అవకాశాలు ఇవ్వండి” అంటూ సజ్జనార్ పేర్కొన్నారు.. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.. దీనిపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. అద్భుతమైన గాయకుడిని పరిచయం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. “అతడి పాట బాగుంది. పాడుతున్న విధానం అద్భుతంగా ఉంది. అలాంటి గాయకులకు అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే కొత్త టాలెంట్ బయటికి వస్తుంది. దానివల్ల ఇండస్ట్రీలో నవ్యతకు బీజం పడుతుంది. దానిని ఇండస్ట్రీ పెద్దలు గుర్తించాలి.. ఆ దిశగా పెద్దపెద్ద సంగీత దర్శకులు అడుగులు వేయాలని” నెటిజన్లు కోరుతున్నారు.
మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!
ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024