https://oktelugu.com/

AP government : గంజాయి వనాల గుర్తింపునకు ఏపీ సర్కార్ ఉపయోగించిన ఈ టెక్నాలజీ చూస్తే గూస్ బాంబ్సే.. ఆ తర్వాతే అసలు కథ

ఇటీవల ఏపీలో డ్రోన్ షో జరిగింది. దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. డ్రోన్ల ద్వారా సరుకుల రవాణా, ఇతర కీలక ఆపరేషన్లు మాత్రమే చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాతే డ్రోన్ల ద్వారా తాము ఏం చేస్తామో ఏపీ ప్రభుత్వం చేతల్లో చేసి చూపించింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2024 / 09:34 PM IST
    Follow us on

    AP government  : ఇటీవల కాలంలో యువతలో మత్తు పదార్థాల వాడకం పెరిగిపోయింది. గంజాయి తాగడం.. ఇష్టానుసారంగా వ్యవహరించడం.. నేరాలకు పాల్పడటం వంటివి ఇటీవల ఏపీలో పెరిగిపోయాయి. ఇన్ని అనర్ధాలకు గంజాయి కారణమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గంజాయి సాగు, రవాణాపై ఉక్కు పాదం మోపుతోంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తోంది. అయినప్పటికీ గంజాయి సాగు దర్జాగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు అడవి మధ్యలో గంజాయిని సాగు చేస్తూ.. రెండవ కంటికి తెలియకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు తాము చేస్తున్న ఈ వ్యవహారం అధికారులకు తెలియదని పొరపడ్డారు. కానీ ఏపీ పోలీసులు గంజాయి సాగుదారులకు షాక్ ఇచ్చారు. ఏకంగా డ్రోన్ల సహాయంతో గంజాయి సాగుదారులకు చెక్ పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం సొలభం పంచాయతీలోని డేగలరాయి అటవీ ప్రాంతంలో పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

    అనుమానం వచ్చి..

    కొంతకాలంగా ఈ ప్రాంతంలో గంజాయి సాగవుతోంది. ఇక్కడి నుంచి గంజాయిని అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేని ఈ ప్రాంతంలో గంజాయి సాగుతున్న విషయం రెండవ కంటికి తెలియదు. దీంతో పోలీసులకు ఇటీవల ఈ వ్యవహారానికి సంబంధించి సమాచారం అందింది. దీంతో కొంతకాలంగా ఈ ప్రాంతం మీద పోలీసు అధికారులు నిఘా పెట్టారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పోలీసులకు అక్కడికి వెళ్లడం సవాల్ గా మారింది. దీంతో పోలీసులు సాంకేతికతను ఆశ్రయించారు. డ్రోన్ల సహాయంతో ఆ ప్రాంతంలో సర్వే చేశారు. ఆ అడవి మధ్యలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో సాగుచేసిన గంజాయిని గుర్తించారు. అక్కడ సాగుచేసిన గంజాయి మొక్కలు విపరీతంగా పెరిగాయి. దీంతో పోలీసులు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ కు సమాచారం అందించారు. దీంతో ఆయన అతి కష్టం మీద అక్కడికి వెళ్లారు. సిబ్బంది సహాయంతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న వెయ్యి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్లో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ గంజాయి సాగు చేస్తున్న వ్యక్తుల వివరాలను సేకరించాలని ఎస్పి రెవెన్యూ అధికారులకు సూచించారు. గంజాయి సాగు చేసే ఎవరి పైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ హెచ్చరించారు. “గంజాయి సాగు ప్రమాదకరం. దాని మత్తుకు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే గంజాయిని సమూలంగా నిర్మూలించాలి. గంజాయి సాగుదారులకు అడ్డుకట్ట వేయాలి. అలాంటి ప్రయత్నమే ఇది అని” ఎస్పీ వ్యాఖ్యానించారు.