TV9 Rajinikanth: జనం నాడి కాదు జర్నలిస్టులకు తెలవాల్సింది?: అయితే ఈ టీవీ9 రజినీకాంత్ స్టోరీ చదవాల్సిందే

2004_05 కాలంలో రజనీకాంత్ టీవీ9 లో ప్రవేశించాడు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి చేరింది. తర్వాత జరిగిన పరిణామాల వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మొత్తం రాజీనామా చేశారు.

Written By: Bhaskar, Updated On : May 5, 2023 2:53 pm

TV9 Rajinikanth

Follow us on

TV9 Rajinikanth: “వార్త యందు జగతి వర్ధిల్లుతున్నది.” వెనకటికి పాత్రికేయులకు ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహించేటప్పుడు ముద్రించే కరదీపికలో ఈ వాక్యం ముందుండేది. అఫ్ కోర్స్ అప్పట్లో మీడియా ఇంత నగ్నంగా నర్తించలేదు కాబట్టి.. ఆ కరదీపికల్లో మంచి మంచి వాక్యాలు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా.. “వార్త యందు జగతి వర్ధిల్లుతున్నది” అనే సామెతకు బదులు “వార్త వల్ల యాజమాన్యం కోట్లకు పడగలెత్తుతున్నది” అని రాసుకునే పరిస్థితి ఏర్పడింది. చాలామంది జర్నలిస్టులు తమకు ప్రపంచ జ్ఞానం తెలుసు, మా అంతటి మేధావులు లేరు అనుకుంటారు. కానీ దీని గురించి వివరించేటప్పుడు ఒక చిన్న లాజిక్ మాట్లాడాలి.

అప్పుడు ఎలా ఉండేదంటే

వెనకటి రోజుల్లో పాత్రికేయుడు అంటే పెరిగిన గడ్డం, కళ్ళకు సోడాబుడ్డి లాంటి కళ్లద్దాలు, లాల్చీ పైజామా, అప్పుడప్పుడు నోటి నుంచి వెలువడే ధారాళమైన పొగ, చేతిలో పెన్ను, భుజానికి ఒక గుడ్డ సంచి.. అందులో కొన్ని కాగితాలు, జేబులో అక్రిడిటేషన్ కార్డు.. జర్నలిస్టుల ఆస్తులు అంటే ఒకప్పుడు ఇలానే ఉండేవి. సమాజంలో గౌరవం కూడా బాగా దక్కేది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిస్టుల స్వభావం పూర్తిగా మారిపోయింది. విషయ పరిజ్ఞానం కంటే వాగాడంబరం పెరిగిపోయింది. యువతులు, యువకులు ఫీల్డ్ లోకి రావడంతో పెద్దలు తప్పుకోవాల్సి వచ్చింది.. ఇప్పుడు ఇలాంటి తరంలో ఎంత వాగితే అంత పెద్ద జర్నలిస్టు అన్నట్టు ముద్ర పడిపోయింది.

ఇంతకీ జనం నాడి తెలుసా?

వాస్తవానికి జర్నలిస్టులు తటస్థంగా ఉండే లక్షణాన్ని కోల్పోయారు. ఏదో ఒక పార్టీకి బాకాలు ఊదడం ఎప్పటినుంచో మొదలుపెట్టారు. జర్నలిస్టులు బాకాలు ఊదుతారు అంటారు కానీ, పక్కాగా యాజమాన్యం ఫోల్డ్ లో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి.. వారికి అది అనివార్యం. కానీ బయట సమాజం అలా చూడదు. “ఫలానా వాడికి నువ్వు ఊడిగం చేస్తున్నావ్” అంటూ దెప్పి పొడుస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగు మీడియాలో చాలామంది ప్రైమ్ టైంలో వాగాడంబరం కలిగిన జర్నలిస్టులు మంది ఉన్నారు. అందులో టీవీ9 రజినీకాంత్ ఒకడు.. ఇక్కడ రజనీకాంత్ ప్రతిసారి తన టీవీ9 ను హైలైట్ చేయడం చాలా బాగుంటుంది. అంతేకాదు ప్రైమ్ టైం న్యూస్ కు సంబంధించి ఇచ్చే ప్రోమోలో జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ అంటూ రజనీకాంత్ ని ఆకాశానికి ఎత్తేయడం ఇంకా బాగుంటుంది.

అప్పుడు నాడి తెలిసిందా?

2004_05 కాలంలో రజనీకాంత్ టీవీ9 లో ప్రవేశించాడు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి చేరింది. తర్వాత జరిగిన పరిణామాల వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మొత్తం రాజీనామా చేశారు. సంతోష్ రెడ్డి ఆ సమయానికి విదేశాల్లో ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే. పైగా మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయనని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన రాజీనామా చేయబోనని మొండికేశారు. తర్వాత జరిగిన అనేక పరిణామాలతో పదవికి రాజీనామా చేసి, తెలంగాణ భవన్ వెళ్లారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఇదే నా నిజమైన తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని నేను ముందుండి నడిపిస్తానని అప్పట్లో ప్రకటించారు. అయితే ఆయన వైఎస్ఆర్ కు సన్నిహితుడని అప్పట్లో చాలా మందికి తెలుసు. అయితే ఈ వార్తను కవర్ చేసిన రజనీకాంత్ “తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నిర్వహిస్తారా? సంతోష్ రెడ్డి భుజానికి ఎత్తుకుంటారా? ” అని వ్యాఖ్యానించారు. టీవీ9 జర్నలిస్టుగా రజనీకాంత్ తొలి కవరేజ్ ఇదే. అయితే ఇందులోనే అసలు మతలబు ఉంది. తెలంగాణలో కోరుకునే హక్కు తెలంగాణ వాదులకు ఉంటుంది. అలాగే తెలంగాణ వద్దు అనే వారికి కూడా అదే స్థాయిలో హక్కు ఉంటుంది. కానీ ఈ చిన్న లాజిక్ మర్చిపోయి రజినీకాంత్ న్యూట్రల్ గా ఉండాల్సిన జర్నలిస్టు స్థానంలో తన అసలు బుద్ధిని ప్రదర్శించాడు.

గాల్లో లెక్కలు వేశారు

ఇక అప్పట్లో మహా టీవీ ఛానల్ లో పనిచేస్తున్నప్పుడు రజనీకాంత్ , ఐ. వెంకట్రావు 2009లో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. అంతే కాదు ఇద్దరూ ఆఫీసులో కూర్చుని ఫలితాలు తేల్చేశారు.. తెలుగుదేశం పార్టీ 180 స్థానాలను గెలుచుకొని అధికారాన్ని దక్కించుకుంటుందని జోస్యం చెప్పారు. కానీ చివర్లో జరిగింది వేరు. అంటే ఇక్కడ కూడా రజనీకాంత్ ఫెయిల్ అయినట్టే. చివరగా చెప్పొచ్చేదేంటంటే జర్నలిస్టులకు తెలవాల్సింది జనం నాడి కాదు యాజమాన్యం నాడి. యాజమాన్యానికి కావాల్సింది తన నాడి.. జనం నాడి కాదు. యాజమాన్యం ప్రాపకం ఉంటేనే జర్నలిస్ట్ కి కొలువుంటుంది..ఇవన్నీ తెర వెనుక ఉన్నాయి కాబట్టే “వార్త యందు యాజమాన్యమే వర్ధిల్లుతుంది.”