https://oktelugu.com/

KTR: నాకు ఎలాంటి ఫామ్‌ హౌస్‌ లేదు..ఎట్టకేలకు ఆ వివాదం నుంచి బయటపడ్డ కేటీఆర్

నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్టీఎల్‌ పరిధిలో ఫామ్‌ హౌస్‌ను నిర్మించి ఉంటే తానే దగ్గర ఉండి కూల్చివేయిస్తానని కేటీఆర్‌ చెప్పారు. ఎఫ్టీఎల్‌ పరిధిలో ఉన్న పలువురు కాంగ్రెస్‌ మంత్రులతో పాటు పెద్ద నాయకుల ఫామ్‌ హౌస్‌ లను కూడా కూడా పరిశీలించాలని వ్యాఖ్యానించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 21, 2024 / 04:02 PM IST

    KTR(1)

    Follow us on

    KTR: తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి తగ్గడం లేదు. రోజుకో అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికారం కల్పోయినా బీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు కూడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణలో గరం గరం పాలిటిక్స్‌ సాగుతున్నాయి మొన్నటి వరకు ఆరు గ్యారంటీల అమలు.. తర్వాత రుణమాఫీ.. ఆ తర్వాత బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం.. హరీశ్‌రావు రాజీనామా.. నిన్నటి వరకు సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహ ప్రతిష్టాపనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం సాగింది. ఇప్పుడు ఫామ్‌హౌస్‌ పాలిటిక్స్‌ తెరపైకి వచ్చాయి. కేటీఆర్‌ జన్వాడలో నిర్మించుకున్నాడని చెబుతున్న పామ్‌హౌస్‌ కూల్చాలని రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అక్రమ కట్టడాల కూల్చివేతలో దూకుడుగా సాగుతున్న హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) నజర్‌ ఇప్పుడు ఫామ్‌హౌస్‌లపై పడింది. ఇప్పటికే నగరంలోని పలు అక్రమ కట్టడాలను కూల్చిన హైడ్రా తాజాగా జన్వాడా ఫామ్‌ హౌస్‌పై దృష్టిపెట్టింది. ఫామ్‌హౌస్‌ను కూల్చివేయవచ్చన్న సమాచారంతో కేటీఆర్‌ అనుచరుడు, ఫామ్‌హౌస్‌ యాజమానిగా చెబుతున్న బద్వేల్‌ ప్రదీప్‌ హైకోర్టులో స్టే ఆర్డర్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పరిణామం జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేతపై ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కఠినంగా ఉన్నారన్న ప్రచారానికి ఊతమిచ్చింది. కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌గా ప్రచారంలో ఉన్న జన్వాడా ఫామ్‌హౌస్‌ వ్యవహారం మొదటి నుంచి రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. గతంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి జన్వాడ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి అది అక్రమ నిర్మాణమంటూ ఆరోపించారు. ఈ వివాదంలో అక్రమంగా డ్రోన్‌ ఎగురవేశారంటూ బీఆరెస్‌ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేసింది. అప్పటి ఘటనకు హైడ్రాతో బదులు తీర్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లుగా బీఆరెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. జన్వాడ ఫామ్‌హౌస్‌ జీవో 111కుు విరుద్ధంగా నిర్మించారని అందుకే హైడ్రా కూల్చివేతకు అవకాశముందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

    నాకు ఫామ్‌హౌస్‌ లేదు..
    ఇదిలా ఉండగా, హైడ్రా దూకుడు, జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేత ప్రచారం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏటీఆర్‌ స్పందించారు. తనకు ఎలాంటి ఫామ్‌ హౌస్‌ లేదని స్పష్టం చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్‌ హౌస్‌ తన స్నేహితుడిదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఫామ్‌ హౌస్‌ను లీజుకు మాత్రం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి కడితే దగ్గరుండి కూలగొటిస్తానని వ్యాఖ్యానించారు.

    దగ్గరుండి కూల్చివేయిస్తా..
    నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్టీఎల్‌ పరిధిలో ఫామ్‌ హౌస్‌ను నిర్మించి ఉంటే తానే దగ్గర ఉండి కూల్చివేయిస్తానని కేటీఆర్‌ చెప్పారు. ఎఫ్టీఎల్‌ పరిధిలో ఉన్న పలువురు కాంగ్రెస్‌ మంత్రులతో పాటు పెద్ద నాయకుల ఫామ్‌ హౌస్‌ లను కూడా కూడా పరిశీలించాలని వ్యాఖ్యానించారు. ‘సోషల్‌ మీడియాలో పలువురు కాంగ్రెస్‌ నేతల ఫామ్‌ హౌస్‌ల ఫొటోలు బయటికి వచ్చాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి, కేవీపీ , మధుయాష్కీ, గుత్తా సుఖేందర్‌ రెడ్డితోపాటు చాలా మంది నేతల ఫామ్‌ హౌసులు ఉన్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌ కూడా ఎక్కడ ఉందో కూడా చూపిస్తా. నాపేరు మీద ఎలాంటి ఫామ్‌ హౌస్‌ లేదు. తప్పు జరిగితే హైడ్రాను తీసుకెళ్లి అన్నింటిని కూల్చివేద్దాం. మంత్రులు, కాంగ్రెస్‌ నాయకుల నిర్మాణాలు కూడా కూల్చేయాలి ’ అంటూ కేటీఆర్‌ క్లారిటీ ఇచ్చారు.