IRCTC: ప్రయాణ సౌకర్యం కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్‌ను 1999 సెప్టెంబర్ 27న పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా స్థాపించారు. ఈ కంపెనీ పూర్తిగా భారత ప్రభుత్వానికి చెందినది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. భారతీయ రైల్వేలకు క్యాటరింగ్ సేవలను అందించడానికి భారతీయ రైల్వేలు ఆమోదించిన ఏకైక సంస్థ కంపెనీ. ఐఆర్‌సీటీసీ భారతదేశంలోని వివిధ రైల్వే స్టేషన్‌లకు ఆతిథ్యం, క్యాటరింగ్ సేవలను అందించే ఏకైక సంస్థ. సంస్థ చాలా ప్రసిద్ధి చెందిన దాని వెబ్‌సైట్ ద్వారా నిర్వహించబడుతున్న ఒంటరి భారతీయ సంస్థ . క్యాటరింగ్‌తోపాటు, కంపెనీ బడ్జెట్ హోటల్‌లు మరియు ఇ–కేటరింగ్ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ల వంటి ఇతర విభాగాలకు విస్తరించింది. ప్రభుత్వం అధికారికంగా ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్‌లను విక్రయించే ఏకైక సంస్థగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, తర్వాత హోటల్ సర్వీసులు, ప్యాకుజ్డ్ వాటర్, ట్రావెల్ అండ్ టూరిజం సేవలను అందుబాటులోకి తెచ్చింది. హోటల్ బుకింగ్‌లు విమాన టిక్కెట్ బుకింగ్‌లతో అనుబంధించబడింది. భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా టూరిస్ట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం గంగా సరయూ దర్శన్ పేరిట కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
వీరికి అందుబాటులో..
ఈ గంగా సరయూ దర్శన్ ప్యాకేజీ కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లలో టూరిస్టులకు అందుబాటులో ఉంటుంది. యాత్ర ముగించుకున్నాక సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంటుంది. ఈ ట్రిప్ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. ప్రతీ ఆదివారం ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి వివిధ తేదీల్లో ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణం కొనసాగుతుందిలా…
– మెదటి రోజు ఉదయం 9.25 గంటలకు సికింద్రాబాద్ (దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం: 12791) నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
– రెండో రోజు వారణాసి చేరుకుంటారు. ముందుగా బుక్ చేసిన హోటల్‌కు చేరుకుంటారు. ఆ సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి చూస్తారు. ఆ రాత్రి అక్కడే బస ఉంటుంది.
– మూడో రోజు ఉదయం అల్పాహారం తీసుకున్నాక వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్) సందర్శించుకోవచ్చు. సాయంత్రం షాపింగ్ ఉంటుంది. రాత్రి బస అక్కడే.
– నాలుగో రోజు టిఫిన్ తిన్నాక అయోధ్య చేరుకుంటారు. అక్కడ హోటల్లో కాసేపు సేదతీరాక అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్ మహలు చుట్టివస్తారు. ఇక సాయంత్రం సరయు ఘాట్ చూసేందుకు వెళ్తారు. రాత్రి ప్రయాగలో బస చేయాల్సి ఉంటుంది.
– ఐదో రోజు ఉదయం అల్పాహారం స్వీకరించాక సాయంత్రం సికింద్రాబాద్ (ట్రైన్ నం: 12792)కు బయల్దేరుతారు.
– ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
చార్జీలు ఇలా…
– కంఫర్ట్ (థర్డ్ ఏసీ బెర్త్) ఒక్కో ప్రయాణికుడికి రూమ్ సింగిల్ షేరింగ్లో అయితే రూ.41,090, ట్విన్ షేరింగ్‌కు రూ.24,350, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.19,720 చెల్లించాలి. 5–11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.15,390, విత్ అవుట్ బెడ్ అయితే రూ.13,790గా నిర్ణయించారు.
– స్టాండర్డ్ (స్లీపర్ బెర్త్) రూమ్ సింగిల్ షేరింగ్ అయితే రూ.21,620, ట్విన్ షేరింగ్‌కు రూ.17,220, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,710. ఇక 5–11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.13,620, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.12,010 చెల్లించాలి.
ఇవి గుర్తుంచుకోండి.
– ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో 3 ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం.
– ప్యాకేజీని బట్టి స్థానికంగా ప్రయాణానికి ఏసీ గదులు, వాహనం ఏర్పాటు చేస్తారు.
– మూడు రోజులు ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ఉంటుంది.
– ప్రయాణ బీమా ఉంటుంది.
– పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే సందర్శకులే చెల్లించాలి.