Hyderabad News: వివాహమై గంట కూడా కాలేదు. ఇంతలోనే వరుడు తనకు నచ్చలేదని వధువు చెప్పడం చర్చనీయాంశం అయింది. పెళ్లి చేసుకున్న గంటకే ప్రియుడితో కలిసి ఉడాయించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అందరిని ఆశ్చర్యపరచిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదంతం జరగడం విచిత్రంగా కనిపిస్తోంది. మనుషుల్లో క్షణానికో చిత్తం కలగడం యాదృచ్చికమేమీ కాకపోయినా ఇది ఆలోచించాల్సిన విషయమే.
బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారి (30) కి ఫలక్ నూమా ప్రాంతంలో ఉండే యువతి (20)కి ఈనెల 16న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికుమారుడి కుటుంబం అదేరోజు రావడంతో శుభకార్యం మరునాటికి వాయిదా వేశారు. 17న సాయంత్రం బాలాపూర్ పరిధిలో పెళ్లి కూతురి బంధువుల నివాసంలో పెళ్లి తంతు ముగించారు. వివాహానంతరం బెంగుళూరుకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు సిద్దం అయింది. అయితే పెళ్లికూతురు తనకివ్వాల్సిన మెహర్ రూ.50 వేలు, నగలు ఇక్కడే ఇవ్వాలని పట్టుబట్టడంతో అందజేశారు.
ఈ నేపథ్యంలో తాను బ్యూటీపార్లర్ కు వెళ్తానని చెప్పి అన్నావదినలతో వెళ్లింది. దీంతో అక్కడే అదృశ్యమైందని తోడు వెళ్లిన వారు వరుడికి ఫోన్ చేశారు. పెళ్లి జరిగిన గంటలోనే వధువు తన అమ్మమ్మకు ఫోన్ చేసి తనకు వరుడు నచ్చలేదని ప్రియుడితో వెళ్లిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరింది. విషయం పోలీసుల వరకు వెళ్లింది.
అయితే తాను ఇచ్చిన డబ్బు, నగలు తిరిగి అందజేయాలని వరుడు కోరాడు. పథకం ప్రకారమే వధువును అతడితో పంపించారని వరుడు ఆరోపించారు. శుక్రవారం రాత్రి నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ఈ వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఇంకా తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.