Hyderabad Rains : ఎంత మంది పాలకులు మారినా ఏమున్నది గర్వకారణం.. ఒక్క భారీ వర్షానికే హైదరాబాద్ మునుగుతున్నది నిజం అని హైదరాబాదీలంతా నెత్తినోరు కొట్టుకుంటున్న పరిస్థితి. విశ్వనగరం అంటూ నాలాలు మూసేసి.. చెరువులను కబ్జా చేసి.. ఎక్కడికక్కడ నీటి ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాలు ఇల్లు కట్టడంతో చిన్న వానకే హైదరాబాద్ మునుగుతోంది. భారీ వర్షాలకు ఇక హైదరాబాద్ అంతా జలమయం అవుతోంది.
హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అధికారులు హై అలెర్ట్ జారీ చేశారు.
హిమాయత్‌సాగర్‌కు భారీ వరద ప్రవాహం
వరుసగా కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్ జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తిగా నిండటంతో అధికారులు గేట్లు ఎప్పుడైనా తీయొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. దీనివల్ల మూసీ నదిలోకి నీటి ప్రవాహం మరింతగా పెరగనుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులు హెచ్చరికలు
మూసీ పరివాహక ప్రాంతమైన చంద్రాయణగుట్ట, ఎగ్జిబిషన్ గ్రౌండ్, అంబర్‌పేట, మలక్‌పేట, ముసరాంబాగ్, చాదర్ ఘాట్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అత్యంత జాగ్రత్త వహించాలన్న విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు.
సహాయానికి హెల్ప్‌లైన్ నంబర్
ప్రజలకు ఎలాంటి అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 040-21111111 ను సంప్రదించవచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ నంబరుకు ఫోన్ చేస్తే వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకొని తక్షణ సహాయం అందిస్తాయి.
– ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ముంపు ప్రాంతాల్లో ఉండే వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. విద్యుత్ సరఫరా పరికరాల నుండి దూరంగా ఉండాలి. ప్రభుత్వ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదు. అవసరమైతే ఎలాంటి సంకోచం లేకుండా హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి
హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ జాగ్రత్తే మీ రక్షణ. సహాయానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.
Massive rains In #Hyderabad city , few places to record 100-150mm in next 1-2 hours , stay safe localised flooding likely in low lying areas#HyderabadRains #Telangana pic.twitter.com/fawizyI6Eq
— Eastcoast Weatherman (@eastcoastrains) August 7, 2025