Madaram : తెలంగాణ రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతాలు కలిగి ఉన్న జిల్లాల్లో ములుగు ఒకటి. ఈ జిల్లా మొత్తం దట్టమైన అటవీ ప్రాంతాలు విస్తారంగా ఉన్నాయి. ముఖ్యంగా మేడారం – తాడ్వాయి మధ్య అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో పులులు, జింకలు, అరుదైన పక్షులు, అడవి దున్నపోతులు, అడవి పందులు, ఇంకా విస్తారంగా జంతు సంపద ఉంది. ఈ ప్రాంతంలో పలు చెరువులు, వాగులు, నీటి కుంటలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం అధికంగా ఉంది కాబట్టి.. ప్రభుత్వం ఈ ప్రాంత పరిధిని అభయారణ్యంగా ప్రకటించింది. పైగా ఇక్కడ విస్తారమైన అటవీ సంపద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ తర్వాత.. ఆ స్థాయిలో వృక్షాలు ఈ అడవిలోనే ఉన్నాయి. అందు గురించే ఇక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా అటవీ సంరక్షణ చర్యలు చేపడుతోంది. జంతువులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ అటవీ సిబ్బంది 24 గంటల పాటు చెక్ పోస్ట్ లలో భద్రతను పర్యవేక్షిస్తుంటారు.. అయితే అలాంటి ఈ ప్రాంతంలో కనివిని ఎరుగని స్థాయిలో అద్భుతం చోటుచేసుకుంది.
సుడిగాలి బీభత్సం
మేడారం – తాడ్వాయి అభయారణ్య పరిధిలో మంగళవారం రాత్రి సుడిగాలి బీభత్సం సృష్టించింది. కనివిని ఎరుగని స్థాయిలో నష్టాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా వచ్చిన గాలి భీకరంగా మారింది. సుడిగాలి తీవ్రత వల్ల మేడారం – తాడ్వాయి అభయారణ్యం పరిధిలో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో విపరీతమైన గాలులు చోటుచేసుకున్నాయి. గాలి తీవ్రతకు పెద్దపెద్ద భారీ వృక్షాలు నేలకూలాయి. సుమారు 50 వేల వృక్షాల వరకు పడిపోయాయని స్థానికులు చెప్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి..” ఆకాశం అప్పటికే మేఘావృతమైంది. చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి. ఆ తర్వాత గాలులు ప్రారంభమయ్యాయి. ఆ గాలులు కాస్తా భీకరంగా మారాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది. ఆ గాలి తీవ్రతకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొంతసేపటి వరకు ఆ ప్రాంతం మొత్తం విధ్వంసంగా మారింది. మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఎన్నో వర్షాలు చూసాం. మరెన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నాం. కానీ ఈ స్థాయిలో తీవ్రమైన గాలిని ఎప్పుడూ చూడలేదు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ మనుషులు లేరు. ఒకవేళ ఉంటే కచ్చితంగా వారి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవని” స్థానికులు అంటున్నారు. మేడారం – తాడ్వాయి మధ్యలో గాలి తీవ్రతకు విరిగిపడిన వృక్షాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి.. ఒకేచోట వందలాది చెట్లు నేలమట్టం.
మేడారం-తాడ్వాయి మధ్య రిజర్వ్ ఫారెస్టులో 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో నేలకూలిన భారీ వృక్షాలు. #Mulugu #WindEffect #Telangana #NewsUpdates #Tolivelugu pic.twitter.com/pwEvoEFrPy
— Tolivelugu Official (@Tolivelugu) September 4, 2024