Eturu Nagaram : కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కొద్దిరోజులు మాత్రమే చలి గాలులు వీస్తున్నాయి. మిగతా రోజులు మండే ఎండలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. అయితే ఈసారి మాత్రం గతానికంటే భిన్నంగా అక్టోబర్ చివరివారం నుంచి చలిగాలులు వేయడం మొదలైంది. నవంబర్లో అయితే చలి గాలులు తారస్థాయికి మించి వీస్తున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా లేకుండా 13 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
గడ్డకట్టించే చలి గాలులు వీస్తున్న ఈ కాలంలో.. ఒక ప్రాంతంలో మాత్రం వేడి నీళ్లు బయటికి వస్తున్నాయి. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. తెలంగాణ రాష్ట్రంలో ఏటూరు నాగారం మండలంలో రామన్నగూడెంలో 365 రోజులు వేడినీళ్లు వస్తాయి. 40 సంవత్సరాల క్రితం ఇక్కడ డీజిల్ కోసం తవ్వకాలు జరిపారు.. అక్కడ తవ్వినచోటి నుంచి వేడి నీళ్లు బయటికి వచ్చాయి. ఇక అప్పటినుంచి అలానే వేడి నీళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతం దట్టమైన అడవిలో ఉంది. ఇక్కడ వృక్షాలు కూడా ఏపుగా ఉంటాయి. వాగులు, వంకలకు అంతే ఉండదు. కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడ ఓఎన్జిసి అధికారులు పరిశోధనలు చేశారు. ఇక్కడ చమురు నిల్వలు ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత ఓ కంపెనీ ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టింది. చమురు నిల్వలు ఉన్నాయని తవ్వకాలు జరిపితే.. ఆ తవ్వకాలనుంచి వేడి నీరు రావడం మొదలుపెట్టింది. ఇక అప్పటినుంచి ఆ కంపెనీ పనులు నిలిపివేసింది. ఆ వేడి నీరు ఉబికి వచ్చే ప్రాంతంలో గ్రామస్తులు స్నానాలు చేస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో స్నానాలు చేయడానికి పోటీలు పడుతుంటారు. అయితే ఈ ప్రాంతంలో వేడి నీరు ఎందుకు వస్తోంది? దానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లభించలేదు.
భూ అంతర్గత మార్పుల వల్లే
చమురు అన్వేషణ కోసం తవ్వకాలు జరిపిన ప్రాంతంలో భారీగా గోతులు ఏర్పడ్డాయి. కాల క్రమంలో అవి కలిసిపోయాయి. అందులో నుంచి ఊటలు వస్తుంటాయి. ఆ వేడి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. భూ అంతర్గత పొరల్లో చోటుచేసుకుంటున్న మార్పు వల్ల ఈ నీరు వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ” చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఇలాంటి వైవిధ్యం లేదు. కేవలం ఇక్కడ మాత్రమే ఇలాంటి నీరు వస్తోంది. సమీపంలో ఉన్న వాగులు, వంకల్లో నీరు చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో అవి ఎండిపోతాయి. కానీ రామన్నగూడెం ప్రాంతంలో నీరు నిత్యం వస్తూనే ఉంటుంది. మండే వేసవి కాలమైనా, ఎముకలను కొరికించే చలి అయినా, విస్తారంగా వర్షాలు కురిసే వానాకాలమైనా ఆ గుంత నుంచి నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీరు వేడిగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వారంతా చలికాలంలో అక్కడ స్నానాలు చేస్తుంటారు.. ఆ నీళ్లు వేడిగా ఉండడమే కాదు.. స్వచ్ఛంగా ఉంటాయి.. చుట్టుపక్కల చెట్లు ఉండడంతో ఆ ప్రాంతం ఆహ్లాదంగా ఉంటుంది. ఇలా నీరు ఎందుకు వేడిగా ఉంటుంది అనే విషయంపై అనేక పరిశోధనలు జరిగాయి. భూ అంతర్గత పొరల్లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల రాపిడి ఏర్పడుతోంది. అది అంతిమంగా ఉబికి వచ్చే నీటిని వేడిగా మార్చుతోంది. అందువల్లే నీరు వేడిగా ఉంటున్నది. అయితే ఇది ఎంతకాలం ఇలా సాగుతుందనే దానిపై స్పష్టత లేదు. కాకపోతే ఇలా నిరంతరం వేడినీరు రావడం మాత్రం ఒక వింత” అని భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ చమురు నిల్వలు ఉన్నాయని తెలిసినప్పటికీ.. తవ్వకాలు ఎందుకు జరపడం లేదనే దానిపై ఇంతవరకు ఒక స్పష్టత లేదు. భవిష్యత్తు కాలంలో ఇక్కడ తవ్వకాలు జరిగే అవకాశాలు లేకపోలేదని స్థానికులు అంటున్నారు.
ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలో 365 రోజులు వేడినీళ్లు వస్తాయి. 40 సంవత్సరాల క్రితం ఇక్కడ డీజిల్ కోసం తవ్వకాలు జరిపారు.. అక్కడ తవ్వినచోటి నుంచి వేడి నీళ్లు బయటికి వచ్చాయి. ఇక అప్పటినుంచి అలానే వేడి నీళ్లు వస్తున్నాయి.#eturunagaram#Telangana pic.twitter.com/4hQuBpA6B0
— Anabothula Bhaskar (@AnabothulaB) November 27, 2024