Hydra Effect : హైడ్రా ఎఫెక్ట్ : నిషేధిత భూముల జాబితాపై హెచ్ఎండీఏ క్లారిటీ.. వారందరికీ బిగ్ రిలీఫ్

తాజాగా వెలుగుచూసిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ నిషేధిత భూముల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టిందనడంలో వాస్తవం లేదట. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో గతంలో ఎప్పుడో అప్‌లోడ్ చేసిన కొన్ని డాక్యుమెంట్ల ఆధారంగానే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారట.

Written By: Srinivas, Updated On : October 24, 2024 1:37 pm

Hydra Effect

Follow us on

Hydra Effect :  హెచ్ఎండీఏ పరిధిలోని పలు పంచాయతీల్లో నిషేధిత భూముల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. వందలాది ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లను ఎత్తివేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఆయా గ్రామాల్లోని రియల్ వ్యాపారులు, భూములు కొన్న వారు ఆందోళనలో పడిపోయారు. తాడోపేడో తేల్చుకునేందుకు సచివాలయం బాట పట్టారు. ఎల్ఆర్ఎస్ కోసం అవకాశం ఇచ్చి నిషేధిత జాబితాలో ఎలా చేర్చుతారని నిలదీశారు. ఆ భూములపై పెట్టిన పెట్టుబడి అంతా కోల్పోతామని, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు సైతం భారీ ఎత్తున నష్టపోతారని జీహెచ్ఎంసీ అధికారులను కలిశారు.

అయితే.. తాజాగా వెలుగుచూసిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ నిషేధిత భూముల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టిందనడంలో వాస్తవం లేదట. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో గతంలో ఎప్పుడో అప్‌లోడ్ చేసిన కొన్ని డాక్యుమెంట్ల ఆధారంగానే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారట. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఆ జాబితాను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. హైదరాబాద్ శివారుల్లోని వందలాది పంచాయతీల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు కాకముందే ఇక్కడ లేఅవుట్లు వెలిశాయి. అప్పుడే వీటిని లేఅవుట్లుగా మలిచి విక్రయించారు. ఇప్పటి ఆ స్థలాలు కూడా చాలా చేతులు మారాయి. అయితే.. ఎప్పుడైతే ఈ హెచ్ఎండీఏ ఏర్పాటైందో.. అప్పటి నుంచి ఈ ఆక్రమిత లేఅవుట్లలో కొన్నింటిని క్రమబద్ధీకరించింది. దీంతో అందులో పెద్దపెద్ద బిల్డింగులు కూడా నిర్మించారు. ఫేక్ వార్తలతో వారంతా ఆందోళనలో పడ్డారు. ఇదే క్రమంలో నిషేధిత జాబితా సోషల్ మీడియాలో దుమారం రేపడంతో అందరినీ ఆందోళనకు గురిచేసింది. నిబంధనల ప్రకారం చేతులు మారిన భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించాల్సిందే తప్పితే వాటిని నిషేధిత జాబితాలో చేర్చే అవకాశం ఉండదు.

హెచ్ఎండీఏ ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 2007 నవంబర్ 19, సెక్షన్ 22ఎ(1)(ఈ) కింద ఆక్రమిత స్థలాలను నిషేధిత జాబితాలో పెట్టింది. ప్రధానంగా రంగారెడ్డి, పెద్దఅంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, ఆదిభట్ల, మంగళపల్లి, మన్నెగూడ, తుర్కయంజాల్, కమ్మగూడ, రాగన్నగూడ, నాదర్గుల్, గుర్రంగూడ, బాలాపూర్ తదితర ప్రాతాల్లో వందలాది పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి. వీటిని గతంలోనే లేఅవుట్లుచేసి అమ్మేశారు. అయితే..గత ప్రభుత్వం హయాంలో వీటికి ఎల్ఆర్ఎస్ చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. దాంతో వేలాది మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు స్థలాలు క్రమబద్ధీకరిస్తారా అని ప్రజలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితాకు హెచ్ఎండీఏకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో మరింత భయం పెంచడానికే కొంతమంది ఆకతాయిలు ఈ పని చేశారని అధికారులు చెబుతున్నారు. దాంతో అక్కడి ప్రజల్లో ఒక్కసారిగా ఉత్కంఠ తొలగిపోయింది. ప్రస్తుతం ఈ ఏరియాల్లో భూములకు భారీ ధరలు పలుకుతున్నాయి. దాంతో విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఈ సమయంలో తమ భూములకు మరోసారి రిస్క్‌లు రాకుండా వెంటనే క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.