Ants: ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేసింది ఆదిమానవులని మనం చిన్నప్పడు పుస్తకాల్లో చదువుకున్నాం. అయితే మనుషులు ఈ భూమ్మీద పుట్టకముందే.. ఇంకా స్థూలంగా చెప్పాలంటే 6.6 కోట్ల సంవత్సరాల క్రితం చీమలు ఈ భూమి మీద వ్యవసాయం చేశాయట. ఇప్పటికీ అదే పని కొనసాగిస్తున్నాయట. ఈ విషయాన్ని అమెరికాలోని స్మిత్ సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు సైన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.. సరిగ్గా 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో భారీ మార్పు చోటుచేసుకుంది. అతి పెద్ద గ్రహశకలం అత్యంత వేగంగా భూమిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో డైనోసార్లు అంతరించిపోయాయి. గ్రహశకలం ఢీకొట్టడం వల్ల అంతరిక్షంలో భారీగా దుమ్ము ఎగిసింది. ధూళి సూర్యరశ్మిని అడ్డుకున్నది. భూమిని చేరనేయకుండా చేసింది. దీంతో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహారం లభించకపోవడంతో డైనోసార్లతో పాటు ఇతర జంతువులు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. ఈక్రమంలో చీమలు తమ మనుగడ కోసం ఆహార అన్వేషణ ప్రారంభించాయి. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని ఎంచుకున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సేద్యం ఇలా ప్రారంభమైంది
గ్రహ శకలం ఢీ కొట్టిన సందర్భంలో సూర్యరశ్మి భూమిని చేరలేదు. దీంతో మొక్కలు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. అప్పుడు చీమలకు ఆహారం లభించకపోవడంతో ఇబ్బంది పడ్డాయి. దీంతో మొక్కల ఆకుల్లోని కొంత భాగాన్ని సేకరించిన చీమలు.. తమ ఆవాస ప్రాంతాలకు తీసుకెళ్లాయి.. మనుషులు సేకరించినట్టుగానే ఆకులను వివిధ మొక్కల ద్వారా సేకరించి.. వాటిని వెలుతురు ఏ మాత్రం సోకని ప్రదేశాలలో భద్రపరిచాయి. వెలుతురు లేకపోవడం వల్ల ఆకులపై శిలీంద్రాలు ఏర్పడ్డాయి. ఆ శిలింద్రాలను చీమలు ఆహారంగా తీసుకున్నాయి.. ఇప్పటికీ అమెరికా, కరీబియన్ దీవుల్లో లీఫ్ కట్టర్ రకానికి చెందిన చీమల జాతులు ఇదే విధానాల్లో వ్యవసాయం చేస్తున్నాయి. ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. అయితే ఈ పరిశోధనకు టెడ్ షల్డ్ నేతృత్వం వహించారు.” ఈ భూమిపై మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేసింది చీమలే. ఈ విషయాన్ని వెల్లడించడానికి 475 శిలీంద్ర జాతులు, 276 రకాల చీమ జాతులపై గండిపరమైన విశ్లేషణ చేశామని” ఆయన పేర్కొన్నారు. మరోవైపు భూమి మీద వైద్యుల కంటే సర్జనులుగా చీమలకే గుర్తింపు పొందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. “చీమలు శ్రమ జీవులని.. అవి ఆహార అన్వేషణకు ఎంత దూరమైనా వెళ్తాయని.. వాటి నుంచి మనుషులు చాలా నేర్చుకోవాలని.. వినూత్న ప్రయోగాలు చేయడంలోనూ చీమలు దిట్టలని” టెడ్ షల్డ్ వ్యాఖ్యానించారు.