HomeతెలంగాణHigh Court: నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు.. తేడా వస్తే కారు పార్టీ ఖాళీ...

High Court: నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు.. తేడా వస్తే కారు పార్టీ ఖాళీ అవడం ఖాయం

High Court: గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి ఓటమిపాలైంది. దాదాపు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.. వీరిపై అనర్హత వేటు వేయాలని.. ఆ దిశగా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలని భారత రాష్ట్ర సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

భారత రాష్ట్ర సమితి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు వాదనలు సుదీర్ఘ కాలం పాటు విన్నది. అయితే హైకోర్టు వెలువరించే తీర్పుతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఎంతో విశ్వాసంగా ఉన్నారు. వారిపై అనర్హత వేటు పడితే తెలంగాణ రాష్ట్రంలో ఆ మూడు స్థానాలలో ఉప ఎన్నికలు వస్తాయని వారు చెబుతున్నారు. ఒకవేళ భారత రాష్ట్ర సమితి ఊహించినట్టు కాకుండా.. వేరే విధంగా తీర్పు వస్తే మొదటికే మోసం వస్తుందనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. భారత రాష్ట్ర సమితి అత్యంత వ్యూహాత్మకంగా వీరి ముగ్గురిపై మాత్రమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భారత రాష్ట్ర సమితి పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భారత రాష్ట్ర సమితి తరపున గెలిచారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ ఆధారాలతో భారత రాష్ట్ర సమితి హైకోర్టులో ధాటిగానే పోరాడుతోంది.

గత తీర్పులను పరిశీలిస్తుంది

ఇలాంటి కేసులలో గత తీర్పులను హైకోర్టు పరిశీలిస్తుంది. “ఇలాంటి కేసులలో మేము జోక్యం చేసుకోలేం. ఇవన్నీ కూడా స్పీకర్ పరిధిలో ఉంటాయి” అనే తీరుగా గతంలో హైకోర్టు తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు కూడా హైకోర్టు ధర్మాసనం అలాంటి తీర్పునే వెల్లడించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలితే.. సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి భారత రాష్ట్ర సమితి న్యాయ విభాగం వెనుకాడబోదు. ఇదే విషయాన్ని ఇటీవల కేటీఆర్ ఢిల్లీలో ప్రకటించారు. కవిత బెయిల్ కోసం కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి.. అక్కడే మకాం వేసిన సమయంలో అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ గురించి చర్చకు వచ్చింది.. ఆ సమయంలో తాము సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఒకవేళ హైకోర్టులో ఆ కేసు ఓడిపోయినప్పటికీ.. సుప్రీంకోర్టు ద్వారా వారిపై అనర్హత వేటు విధించి.. ఉప ఎన్నిక లు తీసుకొస్తామని హరీష్ రావు, కేటీఆర్ పేర్కొన్నారు.

మరింత ఖాళీ అవుతుంది

ప్రస్తుతానికి అయితే సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ తీర్పు భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా వస్తే కారు పార్టీ మరింతగా ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు ఆచరణ వేస్తున్నారు. ఆ ముగ్గురి దారిలోనే మరి కొంతమంది వెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తమతో చాలామంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.. ఒకవేళ హైకోర్టు తీర్పు భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా వస్తే.. మిగతా ఎమ్మెల్యేలకు ధైర్యం వస్తుంది. అంతేకాదు వారు వలస వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version