Revanth Reddy Life Insurance Scheme: తెలంగాణ సర్కార్ నుంచి మరో అదిరిపోయే ‘లైఫ్’ సెటిల్మెంట్ వచ్చేసింది. “చావైనా.. రేవంత్ రెడ్డి ఇచ్చే బీమాతోనే కావాలి” అనే రేంజ్‌లో ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ సిద్ధమవుతోంది. 2026 జూన్ 2 నుంచి రాష్ట్రంలోని కోటిన్నర కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అంట! అంటే ఇకపై యమధర్మరాజు పాశం విసిరితే.. వెనకాలే సెక్రటేరియట్ నుంచి చెక్కు రెడీ అయిపోతుందన్నమాట.
Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?
రూల్స్ లేవు.. కానీ రూటు మాత్రం క్లియర్!
ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా ‘లోడింగ్’ లోనే ఉన్నాయి. కేంద్రం ఇచ్చే PMJJBY ని ఇందులో కలుపుతారా? లేక “మా రూటే వేరు” అని సొంతంగా ఇస్తారా? అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఒక విషయం మాత్రం పక్కా.. పేదోడు, ఉన్నోడు అనే తేడా లేకుండా అందరికీ ఈ బీమా వర్తిస్తుందట! అంటే అపర కుబేరులకు కూడా సర్కారు ఇచ్చే ఆ ఐదు లక్షలు ‘అండగా’ నిలుస్తాయన్నమాట. ఎంత ఉదారత!
– నాగాలాండ్ వర్సెస్ తెలంగాణ: సైజు ముఖ్యం బిగులూ!
నాగాలాండ్ అప్పుడే ఇలాంటి స్కీమ్ పెట్టిందని కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నది కేవలం 2.5 లక్షల కుటుంబాలు. మన దగ్గర ఉన్నది కోటి పైచిలుకు! అంటే వాళ్లు గల్లీ క్రికెట్ ఆడితే.. మన రేవంత్ సర్కార్ ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతోంది. సంఖ్యలో మనమే తోపు.. అమలులో ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.
– ఐదు సవాళ్లు.. అరడజను అనుమానాలు:
రేషన్ కార్డులో ఉన్నవారా? ఇంట్లో ఉన్నవారా? లేక గొడవపడి విడిపోయిన వారా? ‘ఫ్యామిలీ’ డెఫినిషన్ తేలాల్సి ఉంది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తుంటే.. ఎవరి ప్రాణానికి రేటు కట్టాలి? 90 ఏళ్ల తాతయ్యకు కూడా బీమా ఇస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు దివాలా తీయడం ఖాయం. మన దగ్గర ఉన్న డేటా ప్రకారం చూస్తే.. ఒకే వ్యక్తికి మూడు ఊర్లలో ఓట్లు, రెండు ఊర్లలో పెన్షన్లు ఉంటాయి. మరి బీమా ఎన్ని చోట్ల వస్తుందో? మనిషి పోయాక డబ్బులు రావడానికి ముసలితనం వచ్చేయకూడదు కదా!
వైఎస్సార్‌కి ‘ఆరోగ్యశ్రీ’, కేసీఆర్‌కి ‘రైతుబీమా’ పేరు తెచ్చినట్టు.. రేవంత్ రెడ్డికి ఈ ‘ఇందిరమ్మ బీమా’ బ్రాండ్ ఇమేజ్ తెస్తుందని కాంగ్రెస్ నమ్మకం. పథకం సూపర్.. అమలు బంపర్ అయితే చాలు. లేదంటే “డబ్బులు వస్తాయని ఆశపడి చచ్చాం కానీ.. చివరకు చిల్లిగవ్వ రాలేదు” అని ఆత్మలు ఘోషించకుండా ఉంటే అదే పదివేలు!
