Jeevan Reddy: పెద్ద ఓడను సైతం చిన్న చిల్లు ముంచేస్తుంది. ఇది సహజ సిద్ధాంతం. పెద్దఓడ బలంగా ఉందని.. సముద్రంలో దూసుకుపోతోంది అనుకుంటే.. చిన్నచిల్లు ఎంతటి ప్రమాదాన్ని తీసుకురావాలో.. అంతటి ఉత్పతాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. మునిగిపోయిన తర్వాత కానీ పరిస్థితి అర్థం కాదు. ఈ ఉదంతం కేవలం ఒక ఉదాహరణగానే కాదు.. జీవితానికి కూడా వర్తిస్తుంది. ఇక నేటి కాలంలో జరుగుతున్న రాజకీయాలకు ఇది నూటికి నూరు శాతం సరిపోతుంది.
Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?
తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలకపాత్ర పోషించింది. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా మొత్తం గులాబీ పార్టీకి పబ్బతి పట్టింది. అయితే ఈ జిల్లాలో ముఖ్యంగా.. 2018 తర్వాత.. కాంగ్రెస్ పార్టీ ఒక స్థాయిలో లేవడానికి.. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీకి వ్యతిరేకంగా పవనాలు వీయడానికి ఒక కీలక నేత కృషి చేశారు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడంతో.. కాంగ్రెస్ పార్టీకి జవ సత్వాలు లభించాయి. ఆ తర్వాత ఆ పరిణామాలు వేగంగా మారిపోయి కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన బలాన్ని అందించాయి.
కాలం మారిన తర్వాత కాలిగోళ్ళు మేకులైనట్టు.. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడానికి బలమైన కారణమైన జీవన్ రెడ్డి.. ఇప్పుడు గులాబీ పార్టీలోకి చేరిపోతున్నారు. వాస్తవానికి ఈ పరిణామం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఊహించి ఉండరు. కాకపోతే ముందు వచ్చిన చెవుల కంటే.. వెనుక వచ్చిన కొమ్ములు వాడి అయిపోయినట్టు.. జీవన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత.. జగిత్యాలలో సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆ పార్టీ నాయకులకు ఆయన అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయారు. జీవన్ రెడ్డికి అడుగడుగునా అవమానాలు.. ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. ఇక ఆయన తట్టుకోలేక పోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్టు దాదాపుగా ప్రకటించేశారు. మరికొద్ది రోజుల్లో ఆయన గులాబీ కండువా కప్పుకుపోతున్నారు. శనివారం గులాబీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రకారం తన పార్టీ మార్పు తద్యమని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంటి వద్దకు శ్రీధర్ బాబు.. లక్ష్మణ్ వంటి మంత్రులు.. సత్యం వంటి ఎమ్మెల్యే వెళ్లి మంతనాలు జరిగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
వాస్తవానికి జీవన్ రెడ్డి పార్టీ మారడాన్ని కాంగ్రెస్ పార్టీ మామూలుగా చూస్తోంది. ఇప్పటికిప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే అవకాశం లేకపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం . ఇప్పుడు జగిత్యాల సెగ్మెంట్ లో పరిస్థితి ఎలా అయితే ఉందో.. 2023 కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా గళం వినిపించడంతో.. పరిస్థితి ఒక్కసారిగా తారు మారయింది. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ నాయకుడు శ్రీనివాస్ రెడ్డిని తక్కువగా చూశారు. అధిష్టానం ముందు లేనిపోని బిల్డప్పులు ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన జరిగేది ఉండదని.. గులాబీ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని అధిష్టానం ముందు లేని బల ప్రదర్శన చేశారు. కేటీఆర్, కెసిఆర్ కి అయితే లేనిపోని మాటలు చెప్పారు. ఒక సందర్భంలో కేటీఆర్ కు రాంగ్ ఫీడింగ్ ఇచ్చి తన పబ్బం గడుపుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఊహించని విధంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి ఆయాచితమైన బలం రావడంతో ఎన్నికల్లో గెలిచింది.
నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే గులాబీ పార్టీ అధిష్టానం లైట్ తీసుకుంది. వారు వెళ్ళిపోతుంటే ఊదు కాలదని.. పీరి లేవదని భావించింది. కానీ ఎన్నికల్లో జరిగిన నష్టం ఆ పార్టీకి అధికారాన్ని దూరం చేసింది.. ఇప్పుడు జగిత్యాలలో జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అలానే ఉంది. జీవన్ రెడ్డి తన అనుచరులతో గులాబీ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఒకరకంగా బలమైన నాయకుడైన జీవన్ రెడ్డి.. అధికంగా అంత పరిపుష్టం కాకపోయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే నాయకుడు. జగిత్యాలలో మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గాలలో ఆయన ప్రభావం చూపించగలడు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఆయన క్యాడర్ ఇంకా చెక్కుచెదరలేదు. పైగా ఆయనకు కొన్ని వర్గాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే వెలుగుమట్ల వంటి ఘటనలతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోంది. ఓ వర్గం మీడియా గనుక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే.. పరిస్థితి మరో విధంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు మీడియాను మేనేజ్ చేయడం వల్ల ఆ ప్రభావం చెప్పుకునే స్థాయిలో కనిపించడం లేదు. కానీ ఒకసారి ఉపద్రవం మొదలైతే.. దానిని ఎవరూ ఆపలేరు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయంలో మాట్లాడేందుకు ఇష్టపడకపోవచ్చు గాని.. భవిష్యత్తు కాలంలో ఏదైనా జరిగితే.. దీని గురించే మాట్లాడుకుంటారు. ముందే చెప్పుకున్నాం కదా పెద్ద ఓడను ముంచేది చిన్నచిల్లేనని..
