High Court Notices: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలలో పాలకుర్తి నియోజకవర్గంలో పొందిన విషయం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు వరుస విజయాలు సాధించుకుంటూ వస్తున్నారు. పైగా ఇక్కడ గెలిచిన తర్వాత ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఎర్రబల్లి దయాకర్ రావు ను ఓడించి యశస్విని రెడ్డి చరిత్ర సృష్టించారు. వాస్తవానికి ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆమెకు ఉన్న వీసా, ఇతర ఇబ్బందుల వల్ల పోటీ చేయలేకపోయారు. అప్పటికప్పుడు తన కోడలిని పోటీలోకి దించారు. బలమైన దయాకర్ రావును ఓడించారు. ఓడించడం మాత్రమే కాకుండా.. పాలకుర్తి నియోజకవర్గం లో తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే దయాకర్ రావు కంచుకోటల లాగా ఉన్న ప్రాంతాలలో స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇందులో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఝాన్సీ రెడ్డి – యశస్విని రెడ్డి దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఝాన్సీ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో ఒకసారిగా పాలకుర్తిలో, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం నెలకొంది.
నోటీసులు ఎందుకంటే
2017లో ఝాన్సీ రెడ్డి, ఆమె భర్త రాజేందర్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని తొర్రూరు మండలం గుర్తురు గ్రామంలో 75 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని ఝాన్సీ రెడ్డి ఫెమా నిబంధనలను ఉల్లంఘించి కొనుగోలు చేశారని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి అప్పట్లో ఆరోపణలు చేశారు. అంతేకాదు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాడు నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీ రెడ్డికి అప్పటి రెవెన్యూ అధికారులు పాస్బుక్ మంజూరు చేశారని ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలను హైకోర్టుకు సమర్పించారు. అతడు సమర్పించిన ఆధారాలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ భూమి విషయంలో విచారణ మొత్తం పూర్తి చేసి.. నివేదిక అందించాలని ఈడి జాయింట్ డైరెక్టర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2017లో ఝాన్సీ రెడ్డి యాక్టివ్ పొలిటిషన్ కాదు. అప్పటికి ఆమె రాజకీయాల్లోకి రావాలి అని కూడా అనుకోలేదు. కాకపోతే ఓ ప్రజా ప్రతినిధిని పూర్తిస్థాయిలో నమ్మారని.. అతడి వ్యవహార శైలి నచ్చకపోవడంతో.. నేరుగా ఝాన్సీ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని.. తనకు నిబంధనలు అడ్డుగా ఉండడంతో కోడల్ని ఎమ్మెల్యేగా పోటీలో ఉంచారని.. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోటీలో గెలిపించుకున్నారని పాలకుర్తి నియోజకవర్గం లో ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. అయితే ఝాన్సీ రెడ్డి పై అక్కసు తోనే దామోదర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడని కాంగ్రెస్ నాయకుల ఆరోపిస్తున్నారు. దామోదర్ రెడ్డి వెనుక ఓ బలమైన నాయకుడు ఉన్నారని విమర్శిస్తున్నారు. ఝాన్సీ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించలేదని.. అంతా న్యాయబద్ధంగానే భూములు కొనుగోలు చేశారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. అయితే ఈ భూ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: Targets YCP Leaders : అష్టదిగ్బంధనం.. బెదిరిపోతున్న వైసీపీ నేతలు!