Heat Waves: తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. భానుడు కురిపిస్తున్న నిప్పుల వానకు జనం అతలాకుతలం అవుతున్నారు. వడదెబ్బతో మూడు రోజులుగా రోజుకు ఐదుగురు మృత్యువాత పడుతున్నారు. ఉదయం 9 నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో 9 దాటిన తర్వాత బయటకు రావడానికి కూడా జనం భయపడుతున్నారు. రోహిణి కార్తెకు ముందే.. రోకళ్లు పగిలేలా ఎండలు కొడుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే ప్రారంభంలోనే ఇలా ఉంటే రోహిణి కార్తెలో ఇంకా ఎలా ఉంటుందో అని జంకుతున్నారు.
45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు..
ఇక రాష్ట్ర మంతటా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుతున్నాయి. ఖమ్మం, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు వడగాడ్పులు తోడవుతున్నాయి. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ ముందే వెల్లడించింది. మధ్యాహ్నం తరహలో ఉదయమే భానుడు మండుతున్నాడు.
11 జిల్లాలకు రెడ్ అలర్ట్..
ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, ఖమ్మం జిల్లాల్లో తీవ్రత నుంచి అతి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
6వ తేదీ వరకు ఇంతే..
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు మే 6వ తేదీ వరకు ఇలాగే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలపింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఇప్పటికే 43 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తర, తూర్పు జిల్లాలో 46 డిగ్రీలు కూడా దాటేసింది. రానున్న నాలుగైదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని పేర్కొంది.