T20 World Cup 2024: టి20 అంటేనే దూకుడైన ఆటకు అసలైన చిరునామా. అందుకే టి20 టోర్నీలు ఉన్నప్పుడు చాలా వరకు జట్లు యువకులకు ప్రాధాన్యమిస్తాయి. వారికే ఎక్కువ అవకాశాలిస్తాయి. కానీ, వచ్చే నెల రెండు నుంచి ప్రారంభమయ్యే టి20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో యువకులకు ఆశించినంత స్థాయిలో ప్రాధాన్యం దక్కనట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్ తో అలరిస్తున్న రింకూ సింగ్ లాంటి ఆటగాడికి అవకాశం దక్కకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించినప్పుడు, అందులో కచ్చితంగా రింకూ సింగ్ కు చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ అతడిని రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేయడం పట్ల టీమిండియా అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంలో సెలక్టర్ల తీరును తప్పుపడుతున్నారు..ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అమెరికా, వెస్టిండీస్ లో మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తాయట. అందువల్లే అదనపు స్పిన్నర్ కావాలని రోహిత్ శర్మ అడగడంతో.. గత్యంతరం లేక రింకూ సింగ్ కు సముచిత ప్రాధాన్యం ఇవ్వలేకపోయారట.. “రింకూ సింగ్ సమర్ధవంతమైన ఆటగాడు. అతడిని టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయకపోవడం ఒకింత ఇబ్బందికరమైన వాతావరణం. వాస్తవానికి ఈ వ్యవహారంలో అతడి తప్పు లేదు. కెప్టెన్ రోహిత్ అక్కడి మైదానాలను దృష్టిలో పెట్టుకొని అదనపు స్పిన్నర్ కావాలని కోరాడు. ఇద్దరు మణికట్టు బౌలర్లతోపాటు, మరో స్పిన్నర్ ను తీసుకోవాలని కోరాడు. దీంతో రింకూ సింగ్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయాల్సి వచ్చిందని” టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ అన్నాడు. ” విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ పట్ల తీవ్రంగా చర్చ జరిగిందని కొందరు అంటున్నారు. వాస్తవానికి అటువంటి విషయం మా మధ్య ప్రస్తావనకు రాలేదు. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అలాంటప్పుడు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంతమంది చేస్తున్న రాద్ధాంతాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని” అగార్కర్ పేర్కొన్నాడు.
మరోవైపు మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేసేందుకు శివం దూబేను తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఐపీఎల్, అంతకుముందు జరిగిన టోర్నీలలో అతడి ప్రదర్శన ఆధారంగా టి20 వరల్డ్ కప్ ప్రాజెక్టులో అతడికి స్థానం కల్పించామని వివరించాడు..” శివం దూబేను ఎంపిక చేసాం. అయితే, అతడు తుది జట్టులో కొనసాగుతాడనే నమ్మకం లేదు. అక్కడి మైదానాల పరిస్థితి ఆధారంగా చూసి అతన్ని తీసుకుంటాం. జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉండాలని నిర్ణయించాం. అయితే దాని వెనుక ఉన్న కారణాన్ని ప్రస్తుతానికైతే చెప్పలేను. దానిని అమెరికాలోనే బయటపెడతానని” రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
ఇదీ వరల్డ్ కప్ టీం
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా, ఆర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్.