Harish Rao vs Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. ఈ సవాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్వీకరించారు. ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో మళ్లీ హరీశ్‌రావు రాజీనామా లేఖలతో అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు. ఈమేరకు ఏప్రిల్ 26న గన్‌పార్కు వద్దకు రావాలని సవాల్ చేశారు.
చెప్పినట్లుగానే వచ్చిన శరీశ్..
మందుగా చెప్పినట్లు హరీశ్‌రావు శుక్రవారం(ఏప్రిల్ 26న) తన రాజీనామా లేఖతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్దకు వచ్చారు. హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హరీశ్‌రావు తన రాజీనామా లేఖను పీఠంపై ఉంచారు. తర్వాత అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు రాజీనామా లేఖను అందజేశారు.
లేఖను రాజీనామాగా పరిగణించండి..
ఆగస్టు 15ను లోగా హామీలు నెరవేర్చకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని, ఒకవేళ హామీలు నెరేవేరిస్తే.. తాను రాజీనామా చేస్తానని చేసిన ప్రకటన మేరకు రాజీనామా లేఖతో వచ్చానన్నారు. 2024, ఆగస్టు 15లోగా హామీలన్నీ అమలు చేస్తే ఈ లేఖను తన రాజీనామాగా పరిగణించి ఆమోదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాండ్ పేపర్లపై సంతకాలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తుందని సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని సీఎంకు గుర్తు చేశారు.
మేధావుల చేతుల్లో రాజీనామా పత్రాలు..
సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో వచ్చానని తెలిపారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీఎం గన్‌పార్కు వద్దకు రావడానికి ఇబ్బందిగా ఉంటే రాజీనామా లేఖను వారి పీఏ లేదా సిబ్బందితో ఇక్కడికి పంపించినా ఫర్వాలేదని అన్నారు. మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు పెడదామని ప్రతిపాదించారు. తనకు పదవికన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు.