Homeటాప్ స్టోరీస్Harish Rao: హరీష్ రావు లేని లోటు సుస్పష్టం

Harish Rao: హరీష్ రావు లేని లోటు సుస్పష్టం

Harish Rao: హైదరాబాదులో, హైదరాబాద్ తర్వాత అంతటి పేరు ఉన్న వరంగల్లో టిమ్స్ లు కనిపిస్తున్నాయి. అవి కేవలం భవనాలు మాత్రమే కాదు.. సమస్త తెలంగాణ ఆరోగ్యానికి సంజీవనిలు. కార్పొరేట్ వైద్యం అనేది తెలియని పేదలకు మెండైన భరోసా ఇచ్చే ఆరోగ్య ఆలయాలు. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. అవి ఇప్పటికే ప్రారంభమయ్యేవి.. తెలంగాణ ప్రజలకు ఆరోగ్య భరోసాను కల్పించేవి. ప్రభుత్వం మారింది. నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎంతో గొప్ప ఆశయంతో సంకల్పించిన టిమ్స్ లు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. ఆ పనులు కొనసాగుతాయా? పూర్తవుతాయా? అనే ప్రశ్నలకు ప్రస్తుత ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?

గొప్ప నాయకుడు

హరీష్ రావు సిద్దిపేట రూపురేఖలు మార్చారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా తెలంగాణకు సరికొత్త దశ దిశ చూపించారు. ఆరోగ్యశాఖను తీసుకున్న తర్వాత అందులో సమూల మార్పులు తీసుకొచ్చారు. ప్రతి జిల్లాలోని ప్రధాన ఆసుపత్రికి సిటీ స్కాన్ వంటి యంత్రాలను సమకూర్చారు. అప్పట్లో సిటి స్కాన్ కోసం వెళ్లాలంటే ఎంజీఎం లేదా హైదరాబాద్ మాత్రమే దిక్కు. ఎక్కడో మారుమూల ఖమ్మం జిల్లాలో కూడా సిటీ స్కాన్ యంత్రాలను అదికూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయించిన ఘనత ముమ్మాటికి హరీష్ రావుది. టీ డయాగ్నస్టిక్స్ ఏర్పాటు హరీష్ రావు మానస పుత్రిక లాంటిది. దానిద్వారా మధుమేహం నుంచి మొదలు పెడితే థైరాయిడ్ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు చెబుతున్నారు. తద్వారా రోగులకు సత్వరంగా చికిత్స అంది.. మందులు కూడా లభిస్తున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం హరీష్ రావు మీద కక్షతో టీ డయాగ్నస్టిక్స్ సేవలలో కూడా నిర్లక్ష్యం వహిస్తోంది. ఇటీవల వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో సిటీ స్కాన్ యంత్రం పనిచేయలేదు. కనీసం దానికి మరమ్మతులు చేయించాలని కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం అత్యంత దారుణమని రోగులు వాపోతున్నారు.

ఆ భరోసా హరీష్ రావు కల్పించింది

హరీష్ రావు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎల్ వో సీ లు విపరీతంగా ఇచ్చేవారు. ప్రభుత్వం మీద భారం పడుతున్నప్పటికీ ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని తన కార్యాలయంలో ప్రత్యేకంగా సిబ్బందిని దీని కోసమే ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో నిమ్స్ ఆస్పత్రిలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పేషంట్లకు పడకలు దొరికేవి. అర్ధరాత్రి ఏ సమయానికి ఫోన్ చేసినా సరే ఆయన సిబ్బంది అందుబాటులో ఉండేవాళ్లు. దగ్గరుండి బెడ్లు ఏర్పాటు చేయించి.. సత్వర చికిత్స అందించేవారు. ముఖ్యంగా కాలేయం ఇతర సంబంధ వ్యాధులతో బాధపడే వారి కోసం నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారంటే అది ముమ్మాటికి హరీష్ రావు చొరవనే. ఇక సీఎంఆర్ఎఫ్ విషయంలో అయితే హరీష్ రావు చరిత్ర సృష్టించారు అని చెప్పుకోవాలి. తన సిద్దిపేట నియోజకవర్గ మాత్రమే కాకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాల వారికి కొన్ని సందర్భాల్లో తన పరిధి దాటి మరి సహాయం చేసేవారు. అందువల్లే ఆయనను దేవుడు అని కొనియాడుతుంటారు.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండిలో స్వామి అనే వ్యక్తి కాలేయ సంబంధ వ్యాధితో మంచానపడ్డాడు. ఆర్థికంగా కుటుంబం కూడా చితికిపోయింది. ఏం చేయాలో తెలియదు.. ఈ క్రమంలో తనకు తెలిసిన వారి ద్వారా ఆయన కార్యాలయాన్ని సంప్రదించారు. హరీష్ రావు వ్యక్తిగత కార్యదర్శి బీసగోని సిద్ధార్థ ఆ పేషంట్ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే నిమ్స్ లోకి పంపించారు. దాదాపు అక్కడ 20 రోజుల పాటు అతడు చికిత్స పొందాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు స్వామి తన పనులు తాను చేసుకుంటున్నాడు. అంతేకాదు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నాడు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఘనతలు కోకొల్లలు.

హరీష్ రావుది శిఖర స్థాయి

రాజకీయ స్వార్థం కోసం.. ఇంకా ఇతర లక్ష్యాల కోసం కొంతమంది హరీష్ రావును విమర్శిస్తూ ఉండవచ్చు. పైశాచిక ఆనందం పొందుతూ ఉండవచ్చు. కానీ పార్టీతో సంబంధం లేకుండా.. వ్యక్తులతో సంబంధం లేకుండా హరీష్ రావును అభిమానిస్తారు. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లిన సిద్దిపేట ప్రజల మాదిరిగానే ఆయనను ఆదరిస్తారు. ఒక నాయకుడు ఈ స్థాయికి వచ్చాడు అంటే కచ్చితంగా అతడు చేసిన మంచి పనులే దీనికి కారణం. ఇలాంటి పనులు హరీష్ రావు చాలా చేశారు. హార్డ్ వర్కింగ్ మినిస్టర్ గా పేరుపొందారు.. ఈ సువిశాల తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులయ్యారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. కానీ కొందరు మాత్రమే వాటికి వన్నె తీసుకొచ్చారు. అలాంటివారిలో హరీష్ రావు అగ్రస్థానంలో ఉంటారు. హరీష్ రావు ఒక వ్యక్తిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఒక వ్యవస్థగా తన పరిణామాన్ని అభివృద్ధి చేసుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version