Congress Targets Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాల్సింది పోయి ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంది. బిజెపి అడిగిందే తడువుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎదురెళ్లి సహకరించింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ నుంచి ఏ విధమైన సహకారం అందుతుందా? అన్నది చర్చకు దారితీస్తోంది. కానీ కేసులకు భయపడి రాజీ పడిపోయారని జగన్ పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. అయితే ప్రధానంగా బిజెపిని వ్యతిరేకించే ప్రతి పార్టీకి ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శత్రువుగా మారింది. వాస్తవానికి తటస్థంగా ఉంటామంటే బిజెపి సైతం జగన్ విషయంలో ఉదాసీనంగా ఉండేది. కానీ జగన్ మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి సహకరించి.. దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి వ్యతిరేక పార్టీలకు ప్రత్యర్థికి మించి శత్రువు అయ్యారు.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
* ఎప్పటికీ దగ్గర కాకుండా..
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పై ( Y S Jagan Mohan Reddy)తీవ్ర ఆగ్రహంతో ఉంది. గతంలో ఏపీలో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు జగన్. తద్వారా జాతీయస్థాయిలో సైతం తెలుగు రాజకీయ ప్రభావం కాంగ్రెస్ పార్టీ పై పడింది. కాంగ్రెస్ పార్టీ వైయస్ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిస్తే.. జగన్మోహన్ రెడ్డి దారుణంగా తమను వంచించారని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆగ్రహించింది. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత.. చంద్రబాబు ఎన్డీఏకు కీలక భాగస్వామిగా మారిన తర్వాత.. జగన్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొంత సానుకూల వైఖరి కనిపించింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడే సూచనలు కనిపిస్తుండగా.. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని చేరతీయడం ద్వారా పూర్వ వైభవం పొందవచ్చు అని కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడిచింది. అయితే చేజేతులా ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి.
* మారుతున్న ట్రెండ్..
ప్రతి పది, 15 సంవత్సరాలకు పొలిటికల్ ట్రెండ్( political Trend) మారుతుంది. ఈ విషయంలో ఎవరు అతీతం కాదు. ఈ డిజిటల్ యుగంలో మనిషి ఆలోచనలు శరవేగంగా మారుతున్నాయి. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014 వరకు ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంది. సంక్లిష్ట పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరోసారి తన పూర్వవైభవాన్ని చాటుకుంది. 2014లో మోడీ నేతృత్వంలోని బిజెపి హవా ప్రారంభం అయింది. 2019లో అయితే ఎవరి సాయం అక్కర్లేకుండా అధికారంలోకి వచ్చింది. 2024లో మాత్రం మెజారిటీకి దూరంగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపడినట్లు కనిపిస్తోంది. అంతకుమించి బిజెపి వ్యతిరేక పార్టీలో కసి వ్యక్తం అవుతోంది. తద్వారా బిజెపిని గద్దె దించాలన్న ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి. ఏ కూటమితో ప్రమేయం లేకుండా తటస్థంగా నైనా ఉండాలి. లేకుంటే ఇండియా కూటమికి జై కొట్టాలి.
* కేసుల ఉపశమనానికి..
జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ( NDA) కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఆయన గెలుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే కేవలం కేసుల ఉపశమనం. ఇప్పుడు దానినే హైలెట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్న అపవాదులు చాలవన్నట్టు.. కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రచారం చేస్తోంది. జగన్ వెన్నెముక లేని నాయకుడిగా అభివర్ణిస్తోంది. కేసుల గురించి బిజెపికి సరెండర్ అయ్యారని.. చరిత్ర మిమ్మల్ని క్షమించదు అంటూ.. కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సిబిఐ కేసులకు భయపడే ఎన్డీఏకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. ఇది ఏపీ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఇలా చేశారని అన్నారు. ఇదే విషయంపై సంచలన ట్విట్ చేశారు మాణిక్కం ఠాగూర్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఉతికి ఆరేయనుంది. మరోవైపు జాతీయ స్థాయిలో సైతం ఇతర పార్టీల మద్దతు జగన్కు దక్కే అవకాశం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భయం కూడా అదే.