TGPSC Gropu 1 GO 29 : గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గ్రూప్ -1 పరీక్షను నిర్వహించినప్పుడు రెండుసార్లూ లోప భూయిష్టమైన విధానాలు పాటించడం వల్ల రద్దయింది. ఆ వైఫల్యం భారత రాష్ట్ర సమితి ఓటమికి ప్రత్యక్షంగా కారణమైందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే విషయంపై ఆందోళనలు నిర్వహించడం.. ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించడంతో.. సహజంగానే నిరుద్యోగులు హస్తం పార్టీకి జై కొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ -1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవంతంగా ప్రిలిమ్స్ నిర్వహించింది. అయితే సోమవారం నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం హాల్ టికెట్లు కూడా టీజీ పీఎస్సీ లో అందుబాటులో ఉంచింది. అయితే ఇందులో మెజారిటీ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే కొంతమంది అభ్యర్థులు మాత్రం జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి భారత రాష్ట్ర సమితి వెనుక నుంచి సపోర్ట్ చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించిన మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. గ్రూప్ -1 అభ్యర్థులు ఆందోళనలు చేస్తుండడంతో శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అభ్యర్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. సెక్రటేరియట్ వైపు దూసుకు రావడంతో.. పోలీసులు వారిని చెదరగొట్టారు.
జీవో 29 వల్ల ఏమవుతుంది?
పాత జీవో 55 ప్రకారం పరీక్షలు నిర్వహించాలని గ్రూప్ -1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరొకటి ప్రభుత్వం నిబంధనల విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి జరిగేది లేదని చెబుతోంది. జీవో 55 కాకుండా జీవో 29 ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తోంది. రాష్ట్ర హైకోర్టు కూడా సమ్మతం తెలపడంతో ప్రభుత్వానికి కొండంత బలం లభించినట్టయింది. ఇదే క్రమంలో సోమవారం నుంచి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. అటు కొందరు అభ్యర్థులు మాత్రం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పట్టు వీడకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
నాడు కెసిఆర్ ప్రభుత్వం 2022లో గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో రద్దు చేసింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే క్రమంలో తెరపైకి జీవో 29 తీసుకొచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55 ప్రకారం 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.. ఇందులో 40% అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తే.. మిగతా ఆర్వశాతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రిజర్వేషన్ల విధానాన్ని పాటిస్తారు. అప్పుడు మెరిట్ లో ఉన్న రిజర్వ్ డ్ అభ్యర్థులు ఓపెన్ కోటాలో ఎంపిక అవుతారు. అప్పుడు మెరిట్ తక్కువ ఉన్న అభ్యర్థులకు రిజర్వ్ డ్ కేటగిరిలో అవకాశం దక్కుతుంది. దీనివల్ల అటు ఓపెన్, ఇటు రిజర్వ్ డ్ కోటాలో కూడా రిజర్వేషన్లు కలిగి ఉన్న అభ్యర్థులకు లాభం చేకూరుతుంది.