Singareni Jobs: సింగరేణి కార్మికుల వారసులకు శుభవార్త..

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ యూనిఫామ్‌ ఉద్యోగాలు, సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగుల వయసు మినహా.. మిగతా అన్ని ఉద్యోగ నియామకల గరిష్ట వయో పరిమితి పెంచింది.

Written By: Raj Shekar, Updated On : June 11, 2024 4:22 pm

Singareni Jobs

Follow us on

Singareni Jobs: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరం సంస్థ సింగరేణి. సుమారు 40 వేల మంది పర్మినెంట్‌ కార్మికులు, మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సంస్థలో పనిచేస్తున్నారు. భూగర్భం నుంచి నల్ల బంగారంగా పిలిచే బొగ్గును వెలికి తీసే సంస్థలో కొలువు కోసం కార్మికులు ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తారు. సాంకేతికత పెరగడంతో సంస్థలో ప్రమాదాలు కూడా తగ్గాయి. సంస్థలో కొలువు చేయడానికి ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల నిరుద్యోగులు ఉత్సాహం చూపుతారు. ప్రస్తుతం సంస్థలో కార్మికుల రిక్రూట్‌మెంట్‌ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు అనారోగ్యంతో అన్‌ఫిట్‌ అయినా, ప్రమాదంలో మృతిచెందినా.. వారి వారసులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇస్తోంది.

గరిష్ట పరిమితి 35 ఏళ్లు..
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ యూనిఫామ్‌ ఉద్యోగాలు, సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగుల వయసు మినహా.. మిగతా అన్ని ఉద్యోగ నియామకల గరిష్ట వయో పరిమితి పెంచింది. మిదట 40 ఏళ్లుగా, తర్వాత 45 ఏళ్లుగా నిర్ణయిచింది. సింగరేణి కార్మికుల వారసులు ఉద్యోగాలకు మాత్రం వయో పరిమితి 35 ఏళ్లుగానే ఉంచింది. దీనిపై కార్మికుల వారసులు పలుమార్లు నిరసన తెలిపారు. వయో పరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రిటైర్మెంట్‌ వయసు పెంచిన కేసీఆర్‌ సర్కార్‌..
కేసీఆర్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఈ క్రమంలో సింగరేణిలో పనిచేసే కార్మికుల వయసు కూడా పెంచింది. దీంతో రెండేళ్లు సంస్థలో రిటైర్మెంట్లు నిలిచిపోయాయి. ఈ ఏడాది మార్చి నుంచే మళ్లీ రిటైర్మెంట్లు మొదలయ్యాయి.

40 ఏళ్లకు పెంపు…
ఆరు నెలల క్రితం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణి కార్మికుల వారసులకు శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందే వారుసల గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈమేరకు సింగరేణి సీఎండీ బలరామ్‌కు సూచించారు.

ఉత్తర్వులు జారీ చేసి యాజమాన్యం..
సీఎం సూచన మేరకు సింగరేణి యాజమాన్యం కారుణ్య నియామక ఉద్యోగార్థుల వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2018 మార్చి 9 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. దీంతో కార్మికులు వారసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.