Karimnagar municipal election BJP mayor issue : ఓట్ల పండుగ వేళ అండగా నిలిచారు.. గెలుపు గుర్రం ఎక్కించేందుకు చెమటోడ్చారు.. కరీంనగర్ కార్పొరేషన్ గడపపై కాషాయ జెండా ఎగిరేలా భుజం తట్టారు. కానీ, తీరా అధికారం చేతికి చిక్కాక.. ఇచ్చిన మాట గాలికి కలిసిపోయింది. ‘అయ్యేంత వరకు ఆత్మీయుడు.. అయ్యాక పరాయివాడు’ అన్న చందంగా పద్మశాలీల నమ్మకం ఇప్పుడు నడిరోడ్డుపై నిలువునా వంచనకు గురైంది. రాజకీయ చదరంగంలో పావులుగా మారిన తమ సామాజికవర్గం ఆవేదన, గెలిపించిన నేతలే గొంతు కోశారన్న ఆక్రోశం ఇప్పుడు కరీంనగర్ వీధుల్లో మారుమోగుతోంది. నాడు గంగుల, నేడు బండి.. పేర్లు మారినా, పార్టీలు మారినా పద్మశాలీలకు జరిగిన అన్యాయం మాత్రం మారలేదన్నది సగటు కార్యకర్త గుండె కోత!
తెలంగాణలో మున్సిపల్ పాలకవర్గాలు దాదాపు కొలువుదీరాయి. హంగ్ వచ్చినచోట కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 7 కార్పొరేషన్లలో ఏడు పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆరు కాంగ్రెస్ దక్కించుకోగా, కరీంనగర్ బీజేపీ ఖాతాలో పడింది. తెలంగాణలో తొలిసారిగా అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య బీజేపీ కరీంగర్ కార్పొరేషన్ పీఠం దక్కించుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై పద్మశాలీ సామాజికవర్గం భగ్గుమంటున్నారు. ఈ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తమను మోసం చేశారని పద్మశాలీలు ఆరోపిస్తున్నారు. తమ సామాజికవర్గానికి చెందిన వాసాల రమేశ్‌కు మేయర్ పీఠం ఇస్తామని ఎన్నికల ముందు మాట ఇచ్చిన బండి.. ఎన్నికల తర్వాత మాట తప్పారని మండిపడుతున్నారు. దీంతో కరీంనగర్‌లో కుల రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
— Naresh Aennam (@AennamNaresh) February 18, 2026
మేయర్‌గా మున్నూరు కాపు..
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 34 కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది కొలగాని శ్రీనివాస్ (మున్నూరు కాపు) సాధించాడు. డిప్యూటీ మేయర్‌గా వెలమ కులానికి చెందిన సునీల్ రావును నియమించారు, బీఆర్‌ఎస్ తటస్థంగా ఉండడం ఇక్కడ కీలకంగా మారింది. నగరంలో పద్మశాలీలు 50 వేల ఓటర్లు ఉంటారు. దీంతో ఈసారి మేయర్ పీఠంపై పద్మశాలీని కూర్చోబెడతాడుకున్న బండి సంజయ్ తర్వాత మాట తప్పడంపై పద్మశాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాసాల రమేశ్‌కు షాక్..
వాసాల రమేశ్ కొత్తపల్లికి చెందిన సీనియర్ నాయకుడు. డిగ్రీ వరకు చదివిన రమేశ్.. వివిధ పదువులు చేపట్టారు. కొత్తపల్లి సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు ఒకటో వార్డు కౌన్సిలర్‌గా కొనసాగారు. మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా, కొత్తపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కరీనంగర్ ఎంపీపీగా పదవి నిర్వహించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వాసాల రమేశ్ గతంలో బీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్నారు.

నాడు ఆ కాపు… నేడు ఈ కాపు..
తెలంగాణ వచ్చిన తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే మేయర్ పీఠం ఇస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల తర్వాత సునీల్‌రావును మేయర్‌గా ఎంపిక చేసి హ్యాండ్ ఇచ్చారు. ఇక ఏడాది క్రితం బీజేపీలో చేరిన రమేశ్‌కు ఎంపీ బండి సంజయ్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి వస్తే.. మేయర్‌గా చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనూ రమేశ్‌ను ముందు ఉంచి ప్రచారం నిర్వహించారు. దీంతో అంతా రమేశ్ మేయర్ అవుతారని భావించారు. రిజర్వేషన్ కలిసి వచ్చింది. అనుకున్నట్లుగా బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో రమేశ్ మేయర్ కావడం ఖాయం అయిందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఫలితాల తర్వాత బండి సంజయ్ తన కులానికే చెందిన 2వ వార్డు కౌన్సిలర్ కొలగాని శ్రీనివాస్(మున్నూరు కాపు)ను తెరపైకి తెచ్చి మేయర్ పీఠం అప్పగించారు. దీంతో మెజార్టీ పద్మశాలీ కులస్థులు ఆ నేతలు బండి సంజయ్ పై భగ్గుమంటున్నారు. నాడు కాపు ఎమ్మెల్యే గంగుల, నేడు కాపు ఎంపీ బండి.. మరో కాపు కోసం తమ సామాజికవర్గం నేతను రాజకీయంగా ఎదగకుండా చేశారని పద్మశాలీలు మండిపడుతున్నారు.

మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవినీతి ఆరోపణలు..
ఇదిలా ఉంటే.. ప్రస్తుత మేయర్ కొలగాని శ్రీనివాస్‌పై, మాజీ మేయర్ సునీల్‌రావుపై అనేక అవినీతి, అక్రమ కేసులు, భూకబ్జా కేసులు ఉన్నాయని పద్మశాలీలు పేర్కొంటున్నారు. ఈమేరకు పాత కేసులను తవ్వి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తీగలగుట్టపల్లి రెవెన్యూ సొసైటీ సర్వే 120/7లో 400 ప్లాట్ల సెక్యూరిటీ చేసిన దళితుడు కొంకటి లక్ష్మయ్యకు ప్లాట్ 318 ఇచ్చారు? గ్రామపంచాయతీ అనుమతితో రేకుల ఇల్లు కట్టారు. రెవెన్యూ అధికారులు ఇతరులకు నోటీసులు ఇవ్వకుండా ఈ ఇంటిని మాత్రమే కూల్చారు. దీని వెనుక కొలగాని శ్రీనివాస్ ఉన్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. కార్పొరేటర్‌గా తనకు సగం ప్లాట్ డిమాండ్ చేసి ప్లాట్ రెగ్యులరైజేషన్ రద్దు చేయించాడని ఆరోపించాడు. అదే ప్లాట్‌లో మున్నూరు కాపు ఇల్లు కట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని, తాను దళితుడిని కాబట్టే వివక్ష చూపాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 2025, డిసెంబర్ 29న కాంగ్రెస్ నేత కొలగాని అనీల్, ప్రజావాణిలో డివిజన్–2 తీగలగుట్టపల్లి నగునూరు గ్రామానికి మంజూరైన 50 లక్షల ఉపాధి నిధులను శ్రీనివాస్ తన ఫామ్‌హౌస్, వ్యవసాయ భూములకు సీసీ రోడ్లు, డ్రైనేజ్‌కు ఖర్చు చేశాడని ఫిర్యాదు చేశాడు. ఎంబీ రికార్డులు, కాంట్రాక్టర్ల వివరాలు సమర్పించి విచారణ కోరారు. ఇక సునీల్‌రావుపైనా అనేక ఆరోపణలు ఉన్నాయి. తీగల గుట్టపల్లిలలో కోట్ల రూపాయల భూములను కాజేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈమేరకు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో మేయర్‌గా పనిచేసిన సునీల్‌రావు గతంలో ఎంపీగా ఉన్న బండి సంజయ్‌పై చేసిన ఆరోపణల వీడియోలను వైరల్ చేస్తున్నారు.
కుల రాజకీయం..
కరీంనగర్‌లో మున్నూరు కాపు (బండి సంజయ్, గంగుల కమలాకర్) ఆధిపత్యం బలంగా ఉంది. ఎన్నికల్లో ఈ కులం కీలకం. బీఆర్‌ఎస్ గెలిచినా బీసీలు (పద్మశాలి) ఓట్లు కీలకమయ్యాయి. ఇక ఇప్పుడు బీజేపీ గెలుపులోనూ పద్మశాలీ ఓట్లు కీలకమయ్యాయి. అయినా పద్మశాలీలకు పదవులు ఇవ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు. బుధవారం ఫిబ్రవరి 18న సమావేశమైన పద్మశాలీలు ఇకపై స్వతంత్రంగా వ్యవహరించాలని తీర్మానించారు. రాజకీయంగా సొంతంగా ఎదుగుతామని పేర్కొంటున్నారు. ఏ పార్టీతో కలవమని, తమకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామని అంటున్నారు.