https://oktelugu.com/

Babu Mohan : టిడిపిలో చేరకుండానే సభ్యత్వం తీసుకున్న ఆ మాజీ మంత్రి*

తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా విస్తరించాలన్నది చంద్రబాబు ప్లాన్. కానీ తెలంగాణలో ఉనికి కోల్పోయేసరికి ఆ ప్రయత్నం నుంచి విరమించారు. కానీ ఇప్పుడు ఏపీలో టిడిపి గెలిచేసరికి తెలంగాణలో సైతం బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 29, 2024 1:56 pm
    Babu Mohan

    Babu Mohan

    Follow us on

    Babu Mohan :  తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో రెండు రాష్ట్రాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. వంద రూపాయల సభ్యత్వ నమోదు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగానే సభ్యత్వం తీసుకుంటున్నారు. అందుకే ఈసారి రికార్డ్ స్థాయిలో సభ్యత్వ నమోదు ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఏపీలో అధికారంలో ఉండడంతో చాలా ఈజీగా సభ్యత్వ నమోదు అవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో సైతం పార్టీ యాక్టివ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు.ప్రస్తుతం అక్కడ విచిత్ర రాజకీయం కొనసాగుతోంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బాగా వెనుకబడిపోయింది. అటు కాంగ్రెస్ పార్టీ అధికారపక్షంగా ఉంది.బిజెపి సైతం గట్టిగానే పోరాడుతోంది. ఇటువంటి సమయంలోనే టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభించడం విశేషం. అయితే తెలంగాణలో నాయకత్వం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి క్యాడర్ ఉంది. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలామంది నేతలు తటస్థంగా ఉన్నారు. అటువంటి వారంతా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి టిడిపి గూటికి వచ్చారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి బాబు మోహన్ టిడిపి సభ్యత్వమే తీసుకున్నారు. దీంతో తెలంగాణ టిడిపిలో ఒక రకమైన సందడి కనిపిస్తోంది.

    * టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ
    తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాబు మోహన్.ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీలు మార్చుతూ వస్తున్నారు.ఏపీలో పార్టీ సక్సెస్ కావడంతో తెలంగాణపై దృష్టి పెట్టారు చంద్రబాబు. అందులో భాగంగా ఈ నెల 25న హైదరాబాదులో సభ్యత్వాల నమోదుపై సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బాబు మోహన్ హాజరయ్యారు. చంద్రబాబును కలిసి మాట్లాడారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వీడడం వల్ల ఇబ్బందులు పడ్డానని..అవకాశం ఇస్తే పార్టీలో చేరతానంటూ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. అయితే తాజాగా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. ఆందోల్ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు.

    * ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా
    1998లో తొలిసారిగా ఆందోల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు బాబు మోహన్. ఆ ఎన్నికల్లో గెలిచారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో మాత్రం కెసిఆర్ బాబు మోహన్ కు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బిజెపిలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో సైతం మరోసారి బరిలో దిగినా.. ఓటమి ఎదురైంది. మొన్న ఆ మధ్యన కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో రూటు మార్చారు బాబు మోహన్. తెలుగుదేశం పార్టీ ద్వారా యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. అయితే టిడిపి సభ్యత్వం నమోదు పుణ్యమా అని చాలామంది నేతలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.