Matthew Wade : నాటి సంచలన ఇన్నింగ్స్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు వేడ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా సాధించిన విజయాలలో తనవంతు పాత్ర పోషించాడు. సుమారు 13 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియా జట్టుకు తన సేవలు అందించాడు. అటువంటి దిగ్గజ ఆటగాడు భారత్ జట్టుతో త్వరలో జరిగే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి ముందు సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. అయితే క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ దేశవాళి, అంతర్జాతీయ లీగ్ మ్యాచ్ లలో వేడ్ ఆడనున్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియా శిక్షణ సిబ్బందిలో సభ్యుడిగా చేరనున్నాడు. వచ్చే నెలలో అతడు ఈ బాధ్యతలు స్వీకరించనున్నాడు. వేడ్ సమర్థవంతమైన బ్యాటర్ మాత్రమే కాకుండా.. అద్భుతమైన వికెట్ కీపర్ కూడా.. రిటర్మెంట్ తర్వాత తన ప్రణాళికలను వేడ్ వెల్లడించాడు. పాకిస్తాన్ జట్టుతో వచ్చే నెలలో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ నుంచి వేడ్ ఆస్ట్రేలియా కోచింగ్ స్టాఫ్ లో చేరుతాడు. అప్పటినుంచి తన కొత్త అవతారంలో కనిపిస్తాడు.. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో వేడ్ ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. అదే అతడి చివరి టి20 సిరీస్. 2021లో ఆస్ట్రేలియా t20 ప్రపంచ కప్ దక్కించుకోవడంలో వేడ్ ముఖ్యపాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు.. ఓడే మ్యాచ్ గెలిపించి ఔరా అనిపించాడు.. ముఖ్యంగా షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో మూడు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఆస్ట్రేలియా జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు..
రిటైర్మెంట్ తర్వాత..
” జట్టుకు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందిస్తున్నా. ఇక రిటర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. దేశవాళి, అంతర్జాతీయ క్రికెట్ లీగ్ లలో మాత్రం ఆడతాను. నాకు కోచింగ్ చేయడం చాలా ఇష్టం. తర్వాత ఆ పాత్రలోకి వెళ్తాను. జట్టుకు మరో విధంగా సేవలు అందిస్తాను. నన్ను ఇంతటి వాడిని చేయడం వెనుక చాలామంది పాత్రమంది. సహచరులు తోడ్పాటు అందించారు. కోచింగ్ సిబ్బంది నాకు నైపుణ్యాన్ని నేర్పారు. కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు. అమ్మానాన్న నన్ను ఇంతటి వాడిని చేశారు. వారి త్యాగం లేకుండా ఇదంతా జరిగి ఉండేది కాదు. ఏదో ఒక సందర్భంలో.. మనం ఇష్టపడిన దానిని వదులుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే. జాతీయ జట్టుకు మాత్రమే దూరమవుతున్నాను, క్రికెట్ కు కాదు. క్రికెట్ నాతో ఉంటుంది. నాలోనే ఉంటుంది. నాతోనే సాగుతుందని” వేడ్ వ్యాఖ్యానించాడు..
వేడ్ రికార్డులు ఇవి
వేడ్ 36 టెస్టులు, 97 వన్డేలు, 92 T20 లు ఆడాడు. మొత్తంగా 4,700 చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ జట్టుతో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వేడ్ ఆస్ట్రేలియా కోచింగ్ సిబ్బంది లో ఒకటిగా చేరనున్నాడు.