Jogi Ramesh : ఆయన కూడానా.. మాజీ మంత్రి పక్కచూపులు

ఒకప్పుడు వారంతా వైసీపీలో ఒక వెలుగు వెలిగిన వారే. ప్రత్యర్థులను వెంటాడిన వారే. ఇప్పుడు అధికారం దూరం కావడంతో తత్వం బోధపడుతోంది.

Written By: Dharma, Updated On : October 29, 2024 1:54 pm

Jogi Ramesh

Follow us on

Jogi Ramesh : వైసిపి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీకి కీలక నేతలు సైతం గుడ్ బై చెబుతున్నారు. వైసిపి అన్నా.. జగన్ అన్నా.. విపరీతమైన అభిమానం చూపే నేతలు సైతం పక్క చూపులు చూస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అందులో చాలామంది తాజా మాజీ మంత్రులు ఉండడం విశేషం. తాజాగా ఓ మహిళా నేత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినా సరే తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. ఇప్పుడు ఆమె సైతం జనసేనలో చేరతారని టాక్ నడుస్తోంది. రాజధాని ప్రాంతానికి చెందిన మరో మాజీ మంత్రి ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రచారం ఉండగానే వైసిపి ఫైర్ బ్రాండ్లలో ఒకరైన మాజీ మంత్రి జోగి రమేష్ సైతం వైసీపీకి గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైసిపి హయాంలో జోగి రమేష్ దూకుడుగా వ్యవహరించారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేశారు. అటు తరువాత జగన్ పిలిచి మరి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి అయిన తర్వాత చంద్రబాబుతో పాటు పవన్ పై సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు జోగి రమేష్. ఆయన కుమారుడు ఇటీవల అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలు విషయంలో అరెస్ట్ అయ్యారు కూడా. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి విషయంలో కూడా కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చురుగ్గా విచారణ కూడా జరుగుతోంది. వరుస కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జోగి రమేష్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. అదే సేఫ్ జోన్ అని ఒక అంచనాకు వచ్చారు. కానీ గతంలో ఆయన వ్యవహార శైలి పై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన విషయంలో టిడిపి నాయకత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం.

* వైఎస్ఆర్ ప్రోత్సాహంతో
జోగి రమేష్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయంగా రాణించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. 2019లో పెడన నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే ఆయన తొలి మంత్రివర్గంలో స్థానాన్ని ఆశించారు. సామాజిక సమీకరణలో భాగంగా జగన్ అవకాశము ఇవ్వలేదు. అయితే జోగి రమేష్ దూకుడు పార్టీకి పనికి వస్తుందని భావించి.. బీసీ కోటాలో విస్తరణ సమయంలో మంత్రి పదవి ఇచ్చారు జగన్. అయితే ఈ ఎన్నికల్లో జోగి రమేష్ సీటును మార్చారు. అయినా సరే ఆయన ఓడిపోయారు. ఓటమి తర్వాత పాత కేసులు చుట్టుముట్టాయి. దీంతోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

* బీసీ సామాజిక వర్గం
బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ ను పార్టీలో చేర్చుకుంటే మంచిదని కొందరు టిడిపి సీనియర్ నేతలు సూచిస్తున్నారు. ఇంకోవైపు జగన్ ఆత్మస్థైర్యంపై కూడా దెబ్బ కొట్టవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అవినీతి చేశారని జోగి రమేష్ పై కూటమి నేతలు ఆరోపణలు చేసేవారు. అటువంటి నేతను పార్టీలో చేర్చుకుంటే విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే జోగి రమేష్ విషయం ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.