https://oktelugu.com/

BRS President KCR : అస్త్ర, శస్త్రాలు సిద్ధం చేస్తోన్న కేసీఆర్… బరిలోకి అప్పుడేనట.. పక్కా ప్లాన్ ఇదీ

స్థానిక సమరం ముగిసేంతవరకు తాను ఓపిక పట్టాలని, ఈలోగా క్యాడర్ తో విస్తృతంగా అనుసంధానం అవుతూ, పార్టీకి జనంలో సానుకూలత వచ్చేలా చూసుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి తాను సైతం స్వయంగా రంగంలోకి దిగి అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేలా బీఆర్ఎస్ ని నడిపిద్దామని పార్టీ క్యాడర్ కి కేసీఆర్ సంకేతాలిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2024 / 11:06 AM IST

    BRS President KCR

    Follow us on

    BRS President KCR :  పదేళ్ల తర్వాత అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడానికి అస్త్ర,శస్త్రాలు సమకూర్చుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పై ప్రజల్లో మొదలైన వ్యతిరేకతని తమవైపు తిప్పుకునే ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీనీ క్షేత్రస్థాయి నుంచి బలంగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నారు. స్థానిక సమరం ముగిసేంతవరకు తాను ఓపిక పట్టాలని, ఈలోగా క్యాడర్ తో విస్తృతంగా అనుసంధానం అవుతూ, పార్టీకి జనంలో సానుకూలత వచ్చేలా చూసుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి తాను సైతం స్వయంగా రంగంలోకి దిగి అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేలా బీఆర్ఎస్ ని నడిపిద్దామని పార్టీ క్యాడర్ కి కేసీఆర్ సంకేతాలిస్తున్నారు.

    ■ ఫార్మ్ హౌస్ లో క్యాడర్ తో క్షేత్రస్థాయి పరిస్థితులపై లోతుగా ఆరా:
    అధికారం కోల్పోయాక, లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పూర్తిగా ఫార్మ్ హౌస్ కె పరిమితమైన కేసీఆర్ అక్కడేమీ విశ్రాంతి తీసుకొని, కాలక్షేపం చేయడం లేదు. తమ పార్టీ నేతలకి అక్కడి నుంచే డైరెక్షన్లు ఇస్తున్నారు. అంతే కాక పార్టీ సానుభూతిపరులైన అధికారులు, మేధావులతో రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుంది..? కాంగ్రెస్ పరిస్థితి, నేతల తీరుపై ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా గతానికి భిన్నంగా తనని కలవాలని వస్తోన్న గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలతోనూ మాట్లాడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో మూలమూలలో ఏమి జరుగుతోంది..? జనం ఏమి కోరుకుంటున్నారో వారి నుంచి తెలుసుకుంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని మాజీ సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఎవరెవరిని కలిస్తుందీ, ఎవరెవరినుంచి సమాచారం సేకరిస్తోంది అనే విషయాలు బయటకి రాకుండా కట్టడి చేశారు.

    ■ స్థానిక సమరం ముగిశాక ఇక తానే నేరుగా రంగంలోకి వస్తానని సంకేతాలిస్తోన్న మాజీ సీఎం కేసీఆర్:
    కాంగ్రెస్ ప్రభుత్వం, సీయం రేవంత్ రెడ్డిపై జనంలో ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలైందని, ఇది ఇంకా పెరిగేదాకా తాము వేచి ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ భావనగా కనిపిస్తోంది. ఆరు గ్యారంటీల అమలులో చతికిలబడడం, రుణమాఫీ పూర్తిగా అమలవకపోవడం, హైడ్రా, మూసీ ఆక్రమణల కూల్చివేతల లాంటి దుందుడుకు చర్యలతో కాంగ్రెస్ పై జనం లో చర్చ మొదలైందని, ఇది రాబోయే మూడు, నాలుగు నెలల్లో మరింతగా పెరగడం ఖాయంగా బీఆర్ఎస్ అధినేత అంచనా వేస్తున్నారు. ఈలోగా స్థానిక ఎన్నికలూ పూర్తవుతాయని, తమ పార్టీని కూడా ఈ గడువులోగా దుర్భేద్యశక్తిగా క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మిస్తామని కెసిఆర్ సంకేతాలిస్తున్నారు. ఈ నాలుగు నెలల్లో అన్ని అస్త్ర,శస్త్రాలని సమకూర్చుకొని అపై తాను స్వయంగా రంగంలోకి రావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

    ■ ఈసారి కేసీఆర్ రంగంలో దిగితే భూకంపమే:
    సకల అస్త్ర,శస్త్రాలు, పూర్తి క్యాడర్ సన్నద్ధత తో మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, తమ పదేళ్ల పాలనలో చేసిన పనులని ఆయుధాలుగా జనంలోకి తీసుకెళ్లి జనాన్ని మళ్ళీ తమవైపు తిప్పుకుంటామనే ధీమా తో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి తను రంగంలోకి వచ్చాక కాంగ్రెస్, బీజేపీలకు వణుకు తప్పదని, రాజకీయ భూకంపం సృష్టిస్తాననే సంకేతాన్ని కెసిఆర్ క్యాడర్ కి పంపుతుండడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.