Family: కలిసుంటే కలదు సుఖం.. కమ్మని సంసారం.. అని ఓ సినిమాలో పాట విన్నాం. అంటే ఉమ్మడి కుటుంబాలుగా ఉంటే ఆ అనుబంధాలు.. ఆ అన్యోన్యత.. ఆ ప్రయోజనాలు వేరు. ప్రస్తుతం ప్రపంచం ఆధునికం వైపు పరుగులు పెడుతున్నప్పటికీ ఉమ్మడి కుటుంబాల జాడే లేకుండా పోయింది. టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ బంధాలు అంత దూరం అవుతున్నాయి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు.
ఒకప్పుడు పల్లె జీవనం వేరు. పల్లెలు అంటే బతుకు భరోసా అన్న ఫీలింగ్ ఉండేది. పల్లెల్లో ఉమ్మడి కుటుంబాల సంఖ్య వేలల్లో. అలాంటి పల్లెలు కూడా ఆధునికత వైపు పరిగెడుతున్నాయి. చాలా మంది పల్లెలను వీడి పట్నం బాట పడుతున్నారు. దాంతో పల్లెల్లోనూ ఇలాంటి బంధాలు కనిపించడం లేదు. ఇక ఉమ్మడి కుటుంబాలైతే మచ్చుకైనా కనిపించడం లేదు.
పెళ్లి, ఫంక్షన్లు వచ్చాయంటే ఒకప్పుడు కుటుంబ సభ్యులతో వారం పది రోజుల ముందే ఇళ్లకు చేరుకునే వారు. ఒక పండుగలు వచ్చిన కూడా వారం రోజుల ముందే వచ్చేవారు. వారం రోజుల ముందు నుంచి ఆ ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుండేది. వారం పది రోజుల పాటు ఎంతో ఆనందంగా గడిపేవారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి కుటుంబాల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టే పరిస్థితులు వచ్చాయి. అసలు ఉమ్మడి కుటుంబం అంటే ఏంటనే పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పటికాలం పిల్లలకు ఉమ్మడి కుటుంబం గురించి తెలియని కూడా తెలియదు.
ఇక బతుకమ్మ, దసరా పండుగ వస్తోందంటే గ్రామాల్లో ఉండే సందడి అంతాఇంతా కాదు. ఎక్కడెక్కడో ఉన్న వారైనా కూడా గ్రామాల బాట పట్టేవారు. చివరకు విదేశాల్లో ఉన్న వారు కూడా పండుగను ఘనంగా జరుపుకునేందుకు కన్న ఊరికి చేరుకునే వారు. గ్రామానికి వచ్చి కుటుంబసభ్యులు, చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడిపేవారు. పొలం గట్ల వెంబడి ఎంజాయిగా తిరిగేవారు. కానీ.. ఇప్పుడు చేతిలో ఉన్న సెల్‌ఫోన్లే అందరికీ నేస్తాలయ్యాయి. కుటుంబసభ్యులు కలిసినప్పటికీ అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. లేదంటే ఫోన్ కాల్స్ మాట్లాడుతూ బిజీగా ఉండిపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బిడ్డలతో మాట్లాడుదామనుకుంటున్న పెద్దలకు ఆ అవకాశం లేకుండా పోతోంది. దాంతో వారు వచ్చిన సంబరం కంటే వారితో మాట్లాడలేకపోతున్నామనే బాధనే వారిలో కనిపిస్తూ ఉంది.
కానీ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఫ్యామిలీ కొత్త రికార్డు సృష్టించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 150 మంది ఒక దగ్గరకు చేరారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన బద్దం వెంకట్ రామవ్వ-కృష్ణారెడ్డి దంపతులు. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి కుటుంబంలోని మనవళ్లు, మనవరాళ్లు, కొడుకులు, వారిక కుటుంబసభ్యులందరూ ఒకే వేదికపైకి చేరుకున్నారు. అలా 150 మంది ఒకే చోట చేరి ఆనందంగా గడిపారు. ఆత్మీయంగా కలుసుకుని ఎంజాయ్ చేశారు. ఉమ్మడి ఫ్యామిలీకి నిదర్శనంగా నిలిచారు.