Telangana Cabinet : జూలై 4న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. ఈసారి ఎవరికి ఛాన్స్ అంటే?

Telangana Cabinet మంత్రి పదవుల ఎంపికలో సామాజికవర్గాల సమీకరణే కీలకం కానుంది. రెడ్డి సామాజికవర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉండగా, బీసీలు కూడా ఎక్కువగానే పదవులు ఆశిస్తున్నారు.

Written By: NARESH, Updated On : June 26, 2024 7:25 pm

Telangana cabinet

Follow us on

Telangana Cabinet : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలుస్తూనే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు చేర్పులపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. మంగళవారం(జూన్‌ 25న) కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీతో సమావేశమైన రేవంత్‌రెడ్డి నూతన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు తెలుస్తోంది.

కొత్తగా ఆరుగురికి ఛాన్స్‌..
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్రంలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. ఈమేరకు అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో మంత్రి పదవుల కోసం సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

నామినేటెడ్‌ పదవులు కూడా..
తెలంగాణలో ఆరు మంత్రి పదవులతోపాటు 37 నామినేటెడ్‌ పదవుల భర్తీకి కూడా సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే కొన్ని నామినేటెడ్‌ పదవులు భర్తీ చేశారు. అయితే వీటిపై కొందరు మంత్రుల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్‌ పదవుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది.

మంత్రి పదవులు ఇలా..
ఇక ఆరు మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీలకు, ఒకటి లంబాడీలకు, మరొకటి మైనారిటీలకు ఇస్తారని తెలుస్తోంది. ఆరు పదవుల్లో హోం, విద్య, కార్మిక , మున్సిపల్‌ కీలకంగా ఉన్నాయి. ఇందులో హోం శాఖను నిజామాబాద్‌కు చెందిన సుదర్శన్‌రెడ్డికి ఇస్తారని సమాచారం.

ఢిల్లీలో లాబీయింగ్‌..
ఇదిలా ఉండగా మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈమేరకు అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. నలుగురూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఇందులో ఇద్దరికి మంత్రి పదవులు, ఒకరికి డిప్యూటీ స్పీకర్‌ పదవి, మరోకరికి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవి వరించే అవకాశం ఉంది.

సామాజికవర్గాల సమీకరణే కీలకం..
మంత్రి పదవుల ఎంపికలో సామాజికవర్గాల సమీకరణే కీలకం కానుంది. రెడ్డి సామాజికవర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉండగా, బీసీలు కూడా ఎక్కువగానే పదవులు ఆశిస్తున్నారు. మరోవైపు వెలమ సామాజిక వర్గం కోటా ఇప్పటికే భర్తీ కాగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనకు సామాజికవర్గమే అడ్డుగా మారుతోంది.