Yoga World Day : డాలస్‌లో యోగా వరల్డ్‌ డే.. మహాత్మాగాంధీ స్మారకం వద్ద నిర్వహణ

Yoga World Day విశాల మైదానంలో 2 గంటలపాటు సాగిన యోగా డే వేడుకల్లో అన్ని వయసులవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పీకాక్‌ ఇండియా రెస్టారెంట్‌ వారు ఏర్పాటు చేసిన ఫలహారాలను ఆస్వాధించారు.

Written By: NARESH, Updated On : June 26, 2024 8:45 pm

Yoga day

Follow us on

Yoga World Day : అంతర్జాతీయ యోగా డేను అగ్రరాజ్యంలో ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆదివారం(జూన్‌ 23న) నిర్వహించారు. గౌరవ కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డీసీ.మంజునాథ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంజునాథ్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితిలో ఇచ్చిన పిలుపు మేరకు ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వమించడం జరుగుతుందన్నారు. అను నిత్యం యోగాభ్యాసం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

పదేళ్లుగా నిర్వహణ..
అమెరికాలోని మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం పదేళ్లుగా నిర్వహిస్తున్నట్లు ప్రసాద్‌ తోటకూర తెలిపారు. ఏటా హాజరవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రోజు వేడుక కాకూడదని తెలిపారు. అన్ని కార్పొరేట్, విద్యాసంస్థల్లో ప్రతీరోజు యోగాభ్యాసం చేసే విధాన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తద్వారా అందరికీ శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. మహాత్మాగాంధీ మెమోరియల్‌ బోర్డ్‌ సభ్యులందరితో కలసి ప్రసాద్‌ తోటకూర గౌరవ కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, డీసీ.మంజునాథ్‌కు మహాత్ముడి చిత్రపటం బహూకరించారు.

పెరుగుతున్న హాజరు..
మహాత్మాగాంధీ స్మారకం వద్ద ఏటా నిర్వహిస్తున్న యోగా డే వేడుకలకు హాజరయ్యేవారి సంఖ్య పెరుగుతోందని మహాత్మాగాంధీ మెమోరియల్‌ కార్యదర్శి రావు కల్వాల తెలిపారు. సభను ప్రారంభించి ముఖ్య అతిథులు, బోర్డు సభ్యులకు స్వాగతం పలికారు. ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ అధ్యక్షురాలు, మహాత్మాగాంధీ మెమోరియల్‌ బోర్డు సభ్యురాలు సుష్మా మల్హోత్రా క్రమక్రమంగా యోగా డే వేడుకలలో పాల్గొంటున్నవారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది డీఎఫ్‌డబ్ల్యూ హిందూ టెంపుల్, యోగా భారతి, హార్డ్‌ఫుల్‌నెస్, ఈషా, ది యూత్‌ ఎక్స్‌లెన్స్‌ వంటి సంస్థలు తమ సభ్యులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. యోగా డే వేడుకల నిర్వహణకు చాలా మంది కృషి చేశారని తెలిపారు. విశాల మైదానంలో 2 గంటలపాటు సాగిన యోగా డే వేడుకల్లో అన్ని వయసులవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పీకాక్‌ ఇండియా రెస్టారెంట్‌ వారు ఏర్పాటు చేసిన ఫలహారాలను ఆస్వాధించారు.