Etela Rajender: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్రలు నిర్వహిస్తోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు ప్రధాని మోదీ పర్యటన ఖరారు చేసింది. ఇటీవల సమావేశమైన పార్టీ ఎన్నికల కమిటీ తెలంగాణలో కొన్ని సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిని మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని హై కమాండ్ ఈటలకు సూచించినట్లు సమాచారం.
సమావేశంతో స్పష్టత..
అధిష్టానం సూచనతో ఈటల పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే శామీర్‌పేటలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో అల్పాహార విందు సమావేశం బుధవారం(ఫిబ్రవరి 28న) నిర్వహించారు. పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చారు. అధికారికంగా టికెట్ కన్ఫామ్ కాకపోయినా.. ఈటల అభిమానులు, పార్టీ శ్రేణులు మాత్రం టికెట్ ఆయనకే అని పక్కాగా చెబుతున్నాయి. భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
టికెట్ రేసులో వీరు..
ఇదిలా ఉంటే మల్కాజ్‌గిరి బీజేపీ టికెట్‌పై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ఈటల రాజేందర్ కూడా ఒకరు. ఇతర నేతలు మురళీధర్‌రావు, చాడ సురేశ్‌రెడ్డి, మల్క కొమురయ్య లాంటి సీనియర్లు కూడా మల్కాజ్‌గిరి టికెట్ ఆశిస్తున్నారు. వీళ్లు ఇప్పటికే పని మొదలు పెట్టారు. అయితే ఈ స్థానం ఈటలకే కేటాయించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇండియా కూటమికి చెక్ పెట్టేలా..
దేశంలో పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమికి చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ వారంలో 100 మందితో తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తెలంగాణ నుంచి బరిలో నిలిచే 12 మంది పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మల్కాజ్‌గిరి తనకు ఒకే అయినట్లు ఈటల భావిస్తున్నారు. అందుకే బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అతి పెద్ద నియోజకవర్గం..
దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ఈ సీటు బీజేపీకి హాట్ సీటుగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాది ప్రభావం ఎక్కువ. దీంతో బలమైన అభ్యర్థిని నిలిపితే కచ్చితంగా గెలుస్తామని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటలకు అవకాశం ఇవ్వాలని భావించినట్లు తెలిసింది.