AI In Military Operations: ఒకప్పుడు ఒక ఊరిలో ఒకరికో లేదో ఇద్దరికో టెలీ ఫోన్ ఉండేది. కొంతకాలానికి చాలామంది టెలిఫోన్లు ఏర్పాటు చేసుకునే స్థాయికి వాడకం పెరిగిపోయింది. తర్వాత శాస్త్ర సాకేతిక రంగాల్లో సమూల మార్పులు చోటు చేసుకోవడంతో ఏకంగా ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయింది. ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో కృత్రిమ మేథ(Artificial Intelligence) తెరపైకి వచ్చింది. దీని ఆధారంగానే సాంకేతిక ప్రపంచం పరిభ్రమిస్తోంది. ఓపెన్ ఏఐ(Open Ai) చాట్ జీపీటీ ప్రవేశపెట్టడం సమూల మార్పులకు కారణమవుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇతర రంగాల్లోనూ వాడేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అనేక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడేందుకు కసరత్తు జరుగుతున్నది. ముఖ్యంగా సైనిక కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అమెరికా విస్తృతంగా ఉపయోగిస్తుందని బ్లూమ్ బర్గ్ ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. ఇటీవల అమెరికా కొన్ని ప్రాంతాలలో వైమానిక దాడులు చేసింది. ఆ దాడులకు ముందు సైన్యానికి లక్ష్యాన్ని నిర్దేశించేందుకు అమెరికా సైనిక విభాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంది. వైమానిక దాడులకు సంబంధించి లక్ష్యాలను నిర్దేశించేందుకు కంప్యూటర్ విజన్ ఆల్గారిథమ్ ను రూపొందించిందని కలుస్తోంది. ఫిబ్రవరి నెల రెండున నిర్వహించిన మిషన్ లో ఏఐ ఆల్గారిథమ్ సహాయంతో 85 కు పైగా వైమానిక దాడులను అమెరికా సైన్యం చేసింది.
ఈ దాడులకు సంబంధించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇరాక్, సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో రాకెట్స్, మిస్సైల్స్, డ్రోన్ స్టోరేజీ, ఇతర మలిషియా ఆపరేషన్లు చేపట్టింది.. ఇప్పుడు మాత్రమే కాదు అమెరికా రక్షణ విభాగం 2017 లో ప్రాజెక్ట్ మావెన్ కు రూపకల్పన చేసింది.. వైమానిక దాడులకు సంబంధించి అల్గారిథమ్ రూపొందించేందుకు అప్పుడే కసరత్తు మొదలు పెట్టింది.. అప్పటినుంచి ఏడు సంవత్సరాల తర్వాత అనేక పరిశోధనలు జరిపి.. తన వైమానిక దాడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఒక భాగం చేసుకుంది. అయితే ఇది ఇప్పుడే ప్రారంభమైందని.. భవిష్యత్తులో మరింత అధునాతనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటుందని అమెరికా రక్షణ వర్గాలు అంటున్నాయి.