Errabelli Dayakar Rao : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఇది నూటిని నూరుపాళ్లు నిజం. అనేక పర్యాయాలు నిరూపితం కూడా అయింది. అవసరం, అధికారం, పదవుల కోసం నేతలు సిద్ధాంతాలను సైతం పక్కన పెడుతున్న రోజులివీ. కానీ ఈ రోజుల్లో కూడా కొందరు నేతలు.. కొందరితో శాశ్వత శత్రుత్వం(Enimes) మెయింటేన్ చేస్తున్నారు. అలాంటి వారిలో రేవంత్‌రెడ్డి–దయాకర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి–మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డి–కేసీఆర్, రేవంత్‌రెడ్డి–కేటీఆర్ తదితరులు ఉన్నారు. వీరంతా ఒకే పార్టీ నుంచి రాజకీయాలు మొదలు పెట్టిన వారే. తర్వాత పరిణామాలతో క్రమ క్రమంగా పార్టీలు మారారు. టీడీపీలో కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, మల్లారెడ్డి వీరంతా కలిసి పనిచేశారు. కానీ, మంత్రి పదవి ఇవ్వలేదని కేసీఆర్ బయటకు వచ్చి టీఆర్‌ఎస్(TRS)పార్టీ పెట్టారు. ఇక మల్లారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి మాత్రం చాలా వరకు టీడీపీ(TDP)లోనే ఉన్నారు. కానీ, చివరకు ఎర్రబెల్లి బీఆర్‌ఎస్‌లో, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
బద్ధ శత్రువుల్లా..
టీడీపీలో చివరి వరకు పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి పార్టీ కోసం పనిచేశారు. కానీ, ఇక టీడీపీకి తెలంగాణలో భవిష్యత్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఏడాది వ్యవధిలో ఇద్దరూ పార్టీ మారారు. అప్పటి నుంచి ఇద్దరూ బద్ధ శత్రువుల్లా మారారు. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. 2023 ఎన్నికల నుంచి వీరి మధ్య వైరం మరింత ముదిరింది. వ్యక్తిగత విషయాలనూ బయట పెట్టుకుంటూ విమర్శలు చేశారు. మల్లారెడ్డి అయితే అధికారంలో ఉన్నప్పుడు తొడగొట్టి మరీ రేవంత్‌రెడ్డిని సవాల్ చేశారు. అధికారం కోల్పోగానే ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
ప్రజాభిప్రాయం తీసుకుంటూ..
ఇక ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ యువ నేత యశశ్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఓడినా ప్రజల్లోనే ఉంటున్న దయాకర్‌రావు.. తరచూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడారు. వారు రేవంత్‌రెడ్డి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దయాకర్‌రావు కూడా మళ్లీ గెలుస్తడా రేవంత్‌రెడ్డి అని వారిని ప్రశ్నించారు. దీంతో వాళ్లు మళ్లీ 20 ఏండ్ల దాక గెలువడు అంటూ సమాధానం చెప్పారు. తద్వారా రేవంత్‌రెడ్డిపై తనపై ఉన్న వ్యతిరేకతను ప్రజలతో చెప్పించి సంతృప్తి పొందారు.
నమ్మి మోసపోయినం మళ్లీ 20 ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెల్వడు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తమ గోస వెళ్ళబుచుకున్న పెన్షన్ దారులు pic.twitter.com/GWMKovy9n5
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025