VijayaSai Reddy : కొన్ని అనుబంధాలను విడదీయలేం. కొందరి మనుషులను వేరు చేయలేం. అలాగే వైసిపి అధినేత జగన్( Jagan Mohan Reddy) నుంచి విజయసాయిరెడ్డిని వేరు చేయలేం. జగన్ తో పాటు కేసులు ఎదుర్కొన్నారు. జైలు జీవితం అనుభవించారు. వైసిపి ఏర్పాటులో కీలక భాగస్వామ్యం అయ్యారు. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు బాగా కష్టపడ్డారు. జగన్ ప్రతి కష్టంలో పాలుపంచుకున్నారు విజయసాయిరెడ్డి. అటువంటి వ్యక్తి వైసీపీకి గుడ్ బై చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే రాజకీయాల్లో ఇటువంటివి సర్వసాధారణం కూడా. అయితే బలమైన కారణం లేకుండా విజయసాయిరెడ్డి బయటకు వెళ్లడం జరగదు. దీని వెనుక ఏదో కారణం ఉంది. కేసులకు భయపడి మారుంటారు అన్నది ఒక ప్రధాన కారణం. అదే సమయంలో వైసీపీలో ప్రాధాన్యత తగ్గడంతోనేనని మరో విశ్లేషణ ఉంది. అయితే ఆయన వ్యవసాయంతో పాటు వ్యాపారంపై దృష్టి పెడతారని తెలుస్తోంది. మీడియా రంగంలో అడుగు పెట్టాలన్న ఆలోచనతోనే రాజకీయాలకు దూరమయ్యారని ప్రచారం నడుస్తోంది.
* చాలా సందర్భాల్లో అదే మాట
విజయసాయిరెడ్డి చాలా సందర్భాల్లో తాను మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఈనాడులో విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యేక కథనాలు వచ్చాయి. ఆ సమయంలో రామోజీరావు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ దగ్గర మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి రెచ్చిపోతున్నారు అంటూ మండిపడ్డారు. అందుకే తాను సొంతంగా మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని.. దమ్ముంటే కాచుకోండి అంటూ సవాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో కొద్ది రోజులపాటు టీవీ ఛానల్ కు సంబంధించి సన్నాహాలు జరిగాయి. అప్పట్లో ఓ పేరు మోసిన ఛానల్ నుంచి కీలక వ్యక్తి ఎడిటర్ గా చేరినట్లు ప్రచారం నడిచింది. తరువాత ఎందుకో ఈ అంశం కనుమరుగైంది.
* చుట్టూ అనేక వివాదాలు
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి చుట్టూ అనేక వివాదాలు నడిచాయి. ముఖ్యంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న ఓ మహిళ అధికారిణితో సంబంధాలపై అనేక రకాల ఆరోపణలు నడిచాయి. స్వయంగా ఆమె భర్త సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో టిడిపి అనుకూల మీడియాలో పతాక శీర్షికన కథనాలు వచ్చాయి. ఆ సమయంలో మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా సంస్థల అధినేతలను ఏక వచనంతో మాట్లాడారు. చేతిలో మీడియా ఉంది కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించారు. త్వరలో తన సొంత మీడియా అందుబాటులోకి వస్తుందని చెప్పుకొచ్చారు. మరో సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో సైతం తీవ్ర స్థాయిలో వాగ్వాదం నడిచింది. ఆ సమయంలో సైతం తాను మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు.
* మీడియాపై ఫుల్ ఫోకస్
అయితే ఇప్పుడు వైసీపీకి( YSR Congress ) గుడ్ బై చెప్పడం.. వ్యవసాయం చేస్తానని చెప్పడంతో ఆయన దృష్టి మీడియా రంగం వైపు మళ్ళిందని ప్రచారం నడుస్తోంది. పెద్ద టీవీ ఛానల్ ఏర్పాటుతో పాటు అనుబంధంగా కొన్ని సంస్థలను ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే ఆయన మీడియా సంస్థకు సంబంధించి సన్నాహాలు పూర్తయ్యాయని.. సిబ్బంది ఎంపికలు సైతం జరుగుతున్నాయని ఒక ప్రచారం ఉంది. అయితే ఇప్పటికే రాజకీయాల్లో తనకంటూ ముద్ర చూపించారు విజయసాయిరెడ్డి. అందుకే కొద్ది రోజులు పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. చేతిలో మీడియా ఉంచుకొని మళ్లీ సమయం చూసి ప్రత్యర్థులను వేటాడుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి అయితే విజయసాయిరెడ్డి మంచి టాస్క్ మీద ఉన్నట్లు తెలుస్తోంది.